5న వేడుకలా మెగా పీటీఎం
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:47 PM
వచ్చే నెల ఐదో తేదీన ప్రతి విద్యాలయంలో వేడుకలా మెగా పేరెంట్- టీచర్ మీట్(పీటీఎం)ను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
రూ.202 కోట్లతో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధి
బెర్రీబోరర్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
పాడేరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల ఐదో తేదీన ప్రతి విద్యాలయంలో వేడుకలా మెగా పేరెంట్- టీచర్ మీట్(పీటీఎం)ను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంస్కరణల్లో భాగంగా చేపడుతున్న మెగా పీటీఎంను మరింత వినూత్నంగా, ప్రయోజనకరంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. డిసెంబరు ఐదున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి తల్లిదండ్రులిద్దరూ హాజరుకావాలని కోరుతున్నామని, అలాగే ప్రతి విద్యార్థిఽ స్థితిగతులను వారికి టీచర్లు వివరిస్తారన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 2,948 విద్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమంలో లక్షా 20 వేల మంది తల్లిదండ్రులు, లక్షా 80 వేల మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. ప్రజాప్రతినిధులు, పూర్వవిద్యార్థులు, దాతలు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సేవకులు సైతం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పండుగ వాతావరణంలో మెగా పీటీఎంను నిర్వహించడంతోపాటు విద్యాభివృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పాటు ఇచ్చేదిలా ఉంటుందన్నారు.
లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు
ఏజెన్సీలో వచ్చే ఏడాది నుంచి లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.202 కోట్లు మంజూరు చేసిందని, కాఫీకి నీడనిచ్చే మొక్కల పెంపకాన్ని ఈ ఏడాది నుంచే మొదలు పెట్టామన్నారు. ఇప్పటికే 30,500 ఎకరాల్లో నీడనిచ్చే మొక్కలను నాటించామన్నారు. అయితే గతంలో కాఫీ మొక్కలకు నీడ కోసం సిల్వర్‌ఓక్ మొక్కల పెంపకాన్ని చేపట్టారని, కానీ వాటి వల్ల ప్రకృతి వైపరీత్యాల్లో తోటలు ధ్వంసమవుతున్నాయని గుర్తించామన్నారు. ఈ క్రమంలో కాఫీ తోటలకు ఎటువంటి నష్టం కలగకుండా, నీడనిచ్చే మొక్కల ద్వారా గిరిజన రైతులకు ఆదాయం వచ్చేలా పండ్ల మొక్కలను అందించామని చెప్పారు. ఫలితంగా మరో మూడేళ్లలో వాటి ద్వారా ఆదాయం మొదలవుతుందని, ఐదేళ్ల తరువాత కాఫీ మొక్కల ద్వారా ఆదాయం వస్తుందన్నారు. లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధికి చేయడంతోపాటు, మరో 70 వేల ఎకరాల పాత తోటల్లో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించి గ్యాప్ ఫిల్లింగ్ పనులు చేపడతామన్నారు. అలాగే గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది 85 శాతం రాయితీపై పలు పరికరాలను అందించామని, వచ్చే ఏడాది సైతం వాటిని రైతులకు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. గిరిజన రైతులు నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేస్తే ధర సైతం అదే స్థాయిలో లభిస్తుందన్నారు.
బెర్రీబోరర్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
ఏజెన్సీలో కాఫీ తోటలకు ఈ ఏడాది సోకిన బెర్రీబోరర్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో సుమారుగా 170 ఎకరాల్లో కాఫీ తోటలకు బెర్రీబోరర్ సోకిందని, దానిని గుర్తించి వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ చెప్పారు. అలాగే భవిష్యత్తులో కూడా బెర్రీబోరర్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను మన్యంలో కాఫీ క్రయవిక్రయాలపై పలు నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి కాఫీ కొనుగోలుదారు విధిగా తమ నుంచి లైసెన్స్ పొందాలన్నారు. అలాగే కాఫీ పండ్లు/గింజల కొనుగోలు, రవాణా ప్రక్రియల్లో సైతం పక్కాగా నిబంధనలు, నాణ్యతను పాటించాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెర్రీబోరర్ వ్యాప్తికి కారకులైతే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే జీసీసీ ద్వారా వెయ్యి టన్నుల కాఫీ గింజలు, చింతపల్లిలోని మ్యాక్య్ సొసైటీ ద్వారా కాఫీ పండ్లను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తామన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ కొనసాగుతున్నదన్నారు.