డ్రోన్‌తో గిరిజన గ్రామాలకు మందులు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:43 PM
జిల్లా కేంద్రం నుంచి గిరిజన గ్రామాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ సహాయంతో మందులు(మెడిసిన్) తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది.
తాజంగిలో పైలట్ ప్రాజెక్టు ట్రయల్ రన్
చింతపల్లి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం నుంచి గిరిజన గ్రామాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ సహాయంతో మందులు(మెడిసిన్) తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. అధికారులు గురువారం పాడేరు నుంచి తాజంగికి డ్రోన్ సహాయంతో మందులను పంపించి ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. గిరిజన ప్రాంతంలో ఎత్తైన పర్వతాల మధ్యలో గిరిజన గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ కారణంగా మందులను పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలకు తరలించేందుకు అత్యధిక సమయం పడుతోంది. ఈ క్రమంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని సకాలంలో గమ్యస్థానాలకు మందులు తరలించేందుకు డ్రోన్ వ్యవస్థను వినియోగించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. డోన్‌లో 20-30 కిలోల మందులను తరలించవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ట్రయల్ రన్‌లో భాగంగా పాడేరు నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగికి డ్రోన్ సహాయంతో మందులను పంపించారు. అనంతరం డ్రోన్ తిరిగి పాడేరు వెళ్లిపోయింది. ఈ డ్రోన్ వ్యవస్థ విజయవంతమైతే గిరిజన ప్రాంతంలో వైద్యసేవల్లో పెను మార్పు వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజంగి పీహెచ్‌సీ వైద్యాధికారులు కె.సంతోశ్‌కుమార్‌బాబు, భవాని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.