Share News

సీహెచ్‌సీలో అందని వైద్య సేవలు

ABN , Publish Date - May 31 , 2025 | 01:01 AM

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. శుక్రవారం సీహెచ్‌సీ వైద్యులు ఉదయం 11 గంటలు దాటిన తరువాత వచ్చారు. దీంతో ఓపీ చాలా ఆలస్యంగా మొదలైంది.

సీహెచ్‌సీలో అందని వైద్య సేవలు
వైద్యుల కోసం ఎదురు చూస్తున్న రోగులు

సమయ పాలన పాటించని వైద్యులు

వైద్యుల కోసం రోగులు గంటలపాటు నిరీక్షణ

పట్టించుకోని వైద్య విధాన్‌ పరిషత్‌ అధికారులు

సంపూర్ణ వైద్య సేవలు అందించాలని

గిరిజన సంఘం నేతలు డిమాండ్‌

ముంచంగిపుట్టు, మే 30 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. శుక్రవారం సీహెచ్‌సీ వైద్యులు ఉదయం 11 గంటలు దాటిన తరువాత వచ్చారు. దీంతో ఓపీ చాలా ఆలస్యంగా మొదలైంది. వైద్యుల కోసం సీహెచ్‌సీలో రోగులు గంటల తరబడి నిరీక్షించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనరల్‌ ఓపీ చూడాలి. కానీ వైదులు సమయపాలన పాటించకపోవడంతో గత కొద్ది రోజులుగా సీహెచ్‌సీలో ఓపీ ఏ సమయానికి మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వైద్యుల కోసం రోగులు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అలాగే సీహెచ్‌సీలో ఉంటూ వైద్య సేవలు పొందుతున్న రోగులు సైతం ఇబ్బంది పడుతున్నారు. అసౌకర్యాల నడుమ అరకొర వైద్య సేవలు పొందుతున్నామని వారు వాపోతున్నారు. వైద్య విధాన్‌ పరిషత్‌ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఈ పరిస్థితి నెలకొందని గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. సీహెచ్‌సీ బాగోగులపై అధికారులు కనీసం దృష్టి సారించడం లేదని వారంటున్నారు. సీహెచ్‌సీలో మొత్తం 8 మంది వైద్యులను నియమించాల్సి ఉండగా.. కేవలం ముగ్గురు వైద్యులను మాత్రమే నియమించి చేతులు దులుపుకున్నారు. ఉన్న ముగ్గురు వైద్యులలో ఒకరు దంత వైద్యులు కాగా.. ఇద్దరు ఎంబీబీఎస్‌ డాక్టర్లు ఉన్నారు.

సకాలంలో వైద్య సేవలు అందించాలి

సీహెచ్‌సీలో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని గిరిజన సంఘం నేతలు ఎంఎం.శ్రీను, కె.త్రినాథ్‌ అన్నారు. రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని, ఓపీ చాలా ఆలస్యం అవుతుందని తెలియడంతో వారు సీహెచ్‌సీని సందర్శించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నేతలు మాట్లాడుతూ ఓపీని సమయం ప్రకారం నిర్వహించాలని, రోగులకు సంపూర్ణ వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు సమయ పాలన పాటించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ గీతాంజలిని వివరణ కోరగా.. ప్రస్తుతం ఒకే డాక్టర్‌ ఉండడంతో ఓపీ కాస్త ఆలస్యం అయిందన్నారు. మరో డాక్టర్‌ సెలవులో ఉన్నారన్నారు. ఒక డాక్టర్‌ ఉంటే 24 గంటలు సీహెచ్‌సీలో ఓపీ, వార్డులు, అత్యవసర కేసులు చూసుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. దీనివల్ల ఒక్కొక్క రోజు ఓపీ ఆలస్యం అవుతుందన్నారు.

Updated Date - May 31 , 2025 | 01:01 AM