వేరుశనగ సాగులో యాంత్రీకరణ
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:25 AM
వేరుశనగ సాగులో యాంత్రీకరణతో శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతాయి. విత్తనం నాటడం, కలుపుతీత, వేరుశనగ కాయలు వలవడం, కాయల నుంచి విత్తనాలు వేరుచేయడం వంటి పనులకు ఆయా యాంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
విత్తడం, కాయకోత, విత్తనాలను వేరుచేయడానికి అందుబాటులోకి యంత్రాలు
శ్రమ, ఖర్చు, సమయం ఆదా
రాంబిల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వేరుశనగ సాగులో యాంత్రీకరణతో శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతాయి. విత్తనం నాటడం, కలుపుతీత, వేరుశనగ కాయలు వలవడం, కాయల నుంచి విత్తనాలు వేరుచేయడం వంటి పనులకు ఆయా యాంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ యంత్రాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, యంత్రాల ఖరీదు గురించి బీసీటీ-కేవీకే యాంత్రీకరణ శాస్త్రవేత్త శ్రీకాంత గౌడ తెలిపిన వివరాలు..
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లో వేరుశనగ పంటను సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌లో ఎక్కువగా పచ్చి కాయలను (ఉడకబెట్టడానికి) విక్రయించడానికి రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. రబీలో వాణిజ్య సరళిలో..అంటే ఎండుకాయలుగా అమ్ముతుంటారు. ఉమ్మడి జిల్లాలో రబీ సీజన్‌లో సుమారు పది వేల ఎకరాల్లో వేరుశనగ సాగవుతున్నట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. పొలం దున్నడం నుంచి పంట కోత వరకు రైతులు మనుషులు, పశువుల సాయంతోనే వేరుశనగను పండిస్తుంటారు. దీనివల్ల ఖర్చులు అధికం అవుతున్నాయి. వేరుశనగ సాగులో యంత్రాలను వినియోగిస్తే ఖర్చులు, సమయం ఆదా అవుతాయి. పొలం దున్నడానికి, అంతరకృషి వంటి పనులకు ఇప్పటికే యంత్రాలు అందుబాటులోకి వచ్చిన విషయ తెలిసిందే. ఇప్పుడు విత్తనాలు వేయడానికి కూడా యంత్రాలు వచ్చాయి.
విత్తనాలు వేసే యంత్రం
‘హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్’గా పిలిచే ఈ యంత్రంతో వేరుశనగ, మొక్కజొన్నతోపాటు మొత్తం 12 రకాల పంట విత్తనాలను నాటుకోవచ్చు. విత్తన పరిమాణాన్నిబట్టి మీటరింగ్ వీల్ సాయంతో సర్దుబాటు చేసుకోవాలి. మొక్కల మధ్య, వరుసల మధ్య ఎంతెంత దూరం వుండాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ యంత్రంలో ఒక మనిషి 2-3 గంటల్లో ఒక ఎకరం పొలంలో విత్తనం వేయవచ్చు. పాత విధానంలో ఈ పనికి ఎకరాకు రూ.4,500 వరకు ఖర్చు అవుతుంది. యంత్రంతో అయితే రూ.500 సరిపోతుంది. మొక్కలు, వరుసల మధ్య తగిన దూరం వుండడం వల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా ప్రసగించి, పంట ఏపుగా పెరుగుతుంది. దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి. ఈ యంత్రం ధర సుమారు రూ.7,500 ఉంటుంది.
వేరుశనగ కాయలు వలిచే యంత్రం
వేరుశనగ కాయలు పక్వానికి వచ్చిన తరువాత రైతులు కూలీలను ఏర్పాటు చేసుకుని మొక్కలను పీకిస్తారు. కొద్ది రోజులు ఎండిన తరువాత మళ్లీ కూలీలతో కాయలను వలిపిస్తారు. ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ కాయలు వలవడానికి సుమారు 20 మంది కూలీలు అవసరం అవుతారు. ఇందుకు ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకు కూలి చెల్లించాల్సి వుంటుంది. అదే యంత్రంతో అయితే ఇందులో సగం ఖర్చుతో పని పూర్తవుతుంది. ఈ యంత్రం ఖరీదు రూ.65,000. గ్రామంలో ఒక రైతు కొనుగోలు చేసుకుని, మిగిలిన రైతులకు అద్దెకు ఇచ్చుకుంటే ఏడాదితోనే యంత్రం కొనుగోలు డబ్బులు తిరిగి వచ్చేస్తాయి.
కాయల నుంచి గింజలు తీసే యంత్రం
ఈ యంత్రం ద్వారా వేరుశనగ కాయల నుంచి గింజలను వేగంగా వేరుచేయవచ్చు. కూలీల అవసరం గణనీయంగా తగ్గి సమయం, ఖర్చు ఆదా అవుతుఆయి. గింజలకు నష్టం తక్కువగా ఉండి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఈ యంత్రం ధర రూ: 6.500. మరింత సమాచారం కోసం 84311 05162 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని బీసీటీ-కేవీకే యాంత్రీకరణ శాస్త్రవేత్త శ్రీకాంత గౌడ తెలిపారు.