Share News

అరుదైన అరటి, దుంప జాతుల సంరక్షణకు చర్యలు

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:41 PM

తూర్పు కనుముల్లో అరుదైన అరటి, దుంప జాతులను సంరక్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.రవీంద్రకుమార్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ వి.శివకుమార్‌ తెలిపారు.

అరుదైన అరటి, దుంప జాతుల సంరక్షణకు చర్యలు
చౌడుపల్లిలో అరుదైన అరటి రకాలు సేకరిస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రవీంద్రకుమార్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌

ఐదు అరటి, 24 దుంప రకాల సేకరణ

కొవ్వూరు పరిశోధన స్థానంలో పరిశోధనలు

చింతపల్లి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తూర్పు కనుముల్లో అరుదైన అరటి, దుంప జాతులను సంరక్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.రవీంద్రకుమార్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ వి.శివకుమార్‌ తెలిపారు. రెండు రోజులుగా గిరిజన ప్రాంతంలో పర్యటిస్తున్న శాస్త్రవేత్తల బృందం గురువారం చింతపల్లి మండలంలోని అన్నవరం గ్రామంలో ఆదివాసీ రైతుల నుంచి అరటి, దుంప జాతులను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కె.రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో దుంపలు, అరటిపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. పరిశోధన స్థానంలో 130 రకాల అరటి మొక్కలు, 121 చేమ, 43 పెండలం దుంప రకాలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న మేలిమి జాతి అరటి, దుంప జాతులను అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు అందించేందుకు సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. గిరిజన ప్రాంతం నుంచి అరుదైన ఐదు అరటి, ఎనిమిది చేమ, 12 పెండలం దుంప రకాలను సేకరించామన్నారు. గిరిజన రైతుల నుంచి సేకరించిన అరటి రకాలకు ప్రత్యేకంగా నీరు, ఎరువులు పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. పోషక విలువలు, పొటాషియం అధికంగా ఉన్నాయన్నారు. ఈ అరటి రకాలు సహజసిద్ధంగా ఏపుగా పెరుగుతున్నాయన్నారు. గిరిజన రైతుల నుంచి సేకరించిన అరటి, దుంప రకాలపై కొవ్వూరు పరిశోధన స్థానంలో మూడేళ్లపాటు పరిశోధనలు నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా అరటి, దుంప రకాల్లో దిగుబడి, నాణ్యత, రుచి, తెగుళ్లను తట్టుకుని శక్తి, పోషక విలువలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. మంచి రకాలను ఎంపిక చేసి పరిశోధన స్థానంలో అభివృద్ధి చేస్తామన్నారు. మేలిమి జాతి రకాలు గుర్తించిన మొక్కలను మైదాన, గిరిజన ప్రాంత రైతులకు అందజేస్తామన్నారు. భవిష్యత్తులో తెగుళ్లు, వైరస్‌ కారణంగా గిరిజన ప్రాంతంలో ఈ అరటి, దుంప రకాలు అంతరించిపోయినా, పరిశోధన స్థానంలో భద్రపరిచిన మొక్కలను తిరిగి పంపిణీ చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో తుర్పు కనుముల్లో అరుదైన దుంప, అరటి రకాలను సేకరించి భవిష్యత్తు అవసరాలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 11:41 PM