Share News

మురుగునీరు సముద్రంలో కలవకుండా చర్యలు

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:18 AM

నగరంలో మురుగునీరు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు.

మురుగునీరు సముద్రంలో కలవకుండా చర్యలు

కొత్తగా నిర్మించే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు గెడ్డల అనుసంధానం

ఏడాదిన్నరలో శతశాతం అమలు

పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మురుగునీరు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. శుక్రవారం నగరానికి విచ్చేసిన ఆయన బీచ్‌రోడ్డుతోపాటు సముద్ర తీరాన్ని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాండురంగాపురం డౌన్‌, గాదిరాజు ప్యాలెస్‌ వద్ద మురుగునీరు గెడ్డ ద్వారా సముద్రంలో కలుస్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మురుగునీరు కలిస్తే సముద్ర జలాలు కలుషితమై పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మురుగునీటి శుద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మొత్తం 25 కాలువలు ద్వారా బీచ్‌లోకి మురుగునీరు చేరుతోందని, ఇప్పటికే 13 కాలువలను యూజీడీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు అనుసంధానం చేశామన్నారు. మిగిలిన వాటిని కూడా కొత్తగా నిర్మించే ప్లాంట్లకు అనుసంధానం చేస్తామన్నారు. మరో ఏడాదిన్నరలో మురుగునీరు సముద్రంలో కలవకుండా శతశాతం అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నరేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 01:18 AM