బెర్రీ బోరర్ నివారణకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:03 AM
కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ తెగులు నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ తెలిపారు. అరకులోయ చినలబుడు గ్రామ పంచాయతీ పకనకుడి గ్రామంలో బెర్రీ బోరర్ తెగులు సోకిన కాఫీ తోటలను కాఫీ బోర్డు అధికారులతో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు.
సుమారు 140 ఎకరాల కాఫీ తోటల్లో తెగులు వ్యాప్తి చెందినట్టు అంచనా
సమూలంగా నిర్మూలించేందుకు కృషి
ఐటీడీఏ పీవో శ్రీపూజ వెల్లడి
పకనకుడి గ్రామంలోని కాఫీ తోటల సందర్శన
అరకులోయ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ తెగులు నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ తెలిపారు. అరకులోయ చినలబుడు గ్రామ పంచాయతీ పకనకుడి గ్రామంలో బెర్రీ బోరర్ తెగులు సోకిన కాఫీ తోటలను కాఫీ బోర్డు అధికారులతో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ సూచన మేరకు కాఫీ తోటల్లో వ్యాప్తి చెందిన బెర్రీ బోరర్ తెగులు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించేందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ తెగులును శాశ్వతంగా నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించామన్నారు. ప్రస్తుతం ఎన్ని రకాల నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఈ తెగులు సోకిన కాఫీ తోటల్లో పూర్తిగా కాయలను తొలగించి వేడి నీళ్లలో ఉడకబెట్టి భూమిలో పాతిపెట్టారన్నారు. తెగులు సోకిన తోటల్లో ఎట్రాక్టర్ అనే చిన్నపాటి యంత్రాన్ని వేలాడి దీశారని, ఇటువంటి మరో 10 వేల యంత్రాలను తీసుకు వస్తామన్నారు. మొన్నటి వరకు 80 ఎకరాల్లో ఈ తెగులు వ్యాప్తి చెందినట్టు అంచనా వేయగా, ప్రస్తుతం మరో 60 ఎకరాల మేర వ్యాప్తి చెంది ఉండవచ్చునని సంబంధిత శాఖల అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు. దీనికి తగ్గట్టుగా ఆయా తోటల్లో నివారణ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఆమె వెంట కాఫీ బోర్డు అధికారులు, ఐటీడీఏ పీహెచ్‌వో బొంజిబాబు, లైజనింగ్ అధికారులు ఉన్నారు.