ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:54 PM
ఏజెన్సీవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
హెల్మెట్ ధరిస్తేనే జిల్లాలోకి అనుమతి
జాతీయ, రాష్ట్ర రహదారులపై సంతలను నివారించండి
పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలిపేలా చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయండి
కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు విషయాలపై చర్చించి, ఆదేశాలు జారీ చేశారు. ప్రఽధాన మార్గాల్లో ఉన్న చెక్‌పోస్ట్‌ల వద్ద పర్యాటకులు లేదా స్థానికులు హెల్మెట్ ధరిస్తేనే జిల్లాలోకి రావడానికి అనుమతి ఇవ్వాలని, అలాగే మద్యం సేవిస్తే అనుమతి ఇవ్వొద్దని ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రద్దీగా ఉండే ప్రదేశాల్లో జీపులు, ఆటోలు, ఇతర వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు చేపట్టాలని, పార్కింగ్ స్థలాల్లోనే పార్కింగ్ చేసేలా అధికారులు కృషిచేయాలన్నారు. ఏ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేవో నివేదికను ఇవ్వాలని ఆర్టీసీ, డీఈవోలకు ఆదేశించారు. 25 టన్నులు దాటిన వాహనాలకు ఘాట్‌రోడ్డులో అనుమతి ఇవ్వొద్దని, పర్యాటక సీజన్ ప్రారంభం కానుండడంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, భద్రతపై పోలీస్‌శాఖ దృష్టిసారించాలని, జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులపై నిర్వహిస్తున్న సంతల కారణంగా ట్రాఫిక్, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంత స్థలాలను మార్చాలని ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎన్ని ప్రైవేటు వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆరా తీశారు. మద్యం దుకాణాలపై పోలీస్‌శాఖ నిఘా పెట్టాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఎస్పీ షెహబాజ్ అహ్మద్, ఆర్‌అండ్‌బీ ఈఈ బాల సుందరంబాబు, డీటీవో ప్రకాశ్‌రావు, అదనపు వైద్యాధికారి టి.ప్రతాప్, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డి.హేమలతరాణి, పీఆర్ ఈఈ కొండయ్యపడాల్, జిల్లా పంచాయతీ అధికారి కె.చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.