మేలుజాతి పశు సంపద వృద్ధికి చర్యలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:30 AM
గిరిజన ప్రాంతంలో తొలిసారిగా మేలుజాతి పశు సంపద కోసం కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ప్రారంభించనున్నామని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ వి.జయరాజ్ తెలిపారు.
జిల్లాలో తొలిసారిగా పశువులకు కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ప్రారంభం
43 మెగా గోకులాల నిర్మాణం
జిల్లా పశుసంవర్థక శాఖాధికారి జయరాజ్
చింతపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో తొలిసారిగా మేలుజాతి పశు సంపద కోసం కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ప్రారంభించనున్నామని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ వి.జయరాజ్ తెలిపారు. మండలంలోని కృష్ణాపురం గ్రామంలో పశువైద్యులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఇంత వరకు ఎక్కడా కృత్రిమ గర్భధారణ జరగలేదన్నారు. కేవలం సాధారణ గర్భధారణపై రైతులు ఆధారపడుతున్నారన్నారు. దీంతో ఆదివాసీ రైతులకు జాతి పశువులు అందుబాటులో లేవన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలోనూ కృత్రిమ గర్భధారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ మేరకు ప్రతి పశు ఆస్పత్రిలో కృత్రిమ గర్భోత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైన యంత్ర పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని చెప్పారు. నాటు ఆడ పశువులకు జెర్సీ, ఒంగోలు, పుంగనూరు, ప్రత్యేక ఒంగోలు ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేస్తామన్నారు. రెండు నెల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, దీని కోసం జిల్లా వ్యాప్తంగా ఆడ పశువుల సంఖ్య కోసం ప్రత్యేక సర్వే ప్రారంభించామన్నారు. అలాగే జిల్లాలో 43 మెగా గోకులాలు నిర్మించామని, ఒక గోకులం పరిధిలో పది మంది రైతులు ఉంటారన్నారు. ఒక్కొక్క రైతుకు రెండు చొప్పున 20 పశువులను పంపిణీ చేస్తామన్నారు. రైతులు మేలిజాతి పశువులు, గోకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పశువులకు వ్యాధులు సోకిన వెంటనే పశు వైద్యశాలకు తీసుకొచ్చి చికిత్స చేయించాలన్నారు. అనంతరం గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన పశువైద్యాధికారులు దేశగిరి దమయంతి, దుర్గాప్రసాద్, ఎల్‌ఎస్‌ఏ అప్పారావు, జూనియర్ వెటర్నరీ అధికారి అన్నపూర్ణ, అప్పలనర్సలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, పశువైద్యాధికారులు చల్లంగి చాలిని, మత్సరాస సౌందర్య దేవి పాల్గొన్నారు.