గంజాయి రవాణా కట్టడికి చర్యలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:55 PM
గిరిజన ప్రాంతం మీదుగా గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు.
గిరిజన ప్రాంతంలో సాగు ఆగింది..
మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా
జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్
చింతపల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):గిరిజన ప్రాంతం మీదుగా గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. శుక్రవారం మండలంలోని అన్నవరం పోలీసు స్టేషన్‌ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గంజాయి సాగును పూర్తి స్థాయిలో కట్టడి చేశామన్నారు. ఒడిశాలో గంజాయి సాగు జరుగుతున్నదని, గంజాయి వ్యాపారులు ఒడిశాలో కొనుగోలు చేసి గిరిజన ప్రాంతం మీదుగా మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్నారు. జిల్లా మీదుగా గంజాయి రవాణాను కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. గంజాయితో సంబంధాలు కలిగిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేదిలేదన్నారు. గంజాయితో పట్టుబడిన నిందితుల ఆస్తులను సైతం జప్తు చేస్తామన్నారు. గంజాయి రవాణా, సాగులకు ఆదివాసీలు దూరంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గిరిజన ప్రాంతంలో మావోయిస్టు ఉనికి లేకపోయినప్పటికి వారి కార్యకలాపాలపై నిఘా పెట్టామన్నారు. గిరిజన ప్రాంతంలో క్రైమ్ రేటు తగ్గించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనంతరం అన్నవరం పోలీసు స్టేషన్ భద్రత, పోలీసు నివాస గృహాలను పరిశీలించారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నవరం స్టేషన్‌లో రికార్డులను పరిశీలించిన ఎస్పీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. వినోద్‌బాబు, ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.