Share News

బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:51 PM

గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ సి. మధుమతి అన్నారు.

బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి నియంత్రణకు చర్యలు
తెగులు వ్యాప్తి చెందిన కాఫీ తోటలను పరిశీలిస్తూ శాస్త్రవేత్తలకు సూచనలు ఇస్తున్న విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ మధుమతి

మూడు డివిజన్లలో ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీలు

సోమవారం నుంచి తోటల పరిశీలన

వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం

పరిశోధన సంచాలకులు డాక్టర్‌ సి.మధుమతి

చింతపల్లి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ సి. మధుమతి అన్నారు. శనివారం స్థానిక ఉద్యాన పరిశోధన స్థానాన్ని సందర్శించిన ఆమె కాఫీ బెర్రీ బోరర్‌ వ్యాప్తి చెందిన కాఫీ తోటలు, తెగులు నివారణ చర్యలను స్వయంగా పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మధుమతి విలేకర్లతో మాట్లాడుతూ స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలోని 1.25ఎకరాల్లో కాఫీ తోటల్లో 10 శాతం మొక్కలకు కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి చెందిందన్నారు. ఈ తెగులు వ్యాప్తిని ప్రాథమిక స్థాయిలోనే నియంత్రించాలనే కాఫీ కాయలన్నీ సేకరించి వేడినీళ్లలో ముంచి గొయ్యిలో పూడ్చివేస్తున్నామన్నారు. అరకులోయ చిన్నలబుడు పంచాయతీ పరిధిలో 79 ఎకరాల్లో ఈతెగులు కనిపించిందన్నారు. రైతులను ఒప్పించి నివారణ చర్యలు చేపడుతున్నారన్నారు. కాఫీ పంటను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందన్నారు. కాఫీ తోటల్లో ఎకరానికి పది చొప్పున ట్రాఫ్‌లను కేంద్ర కాఫీ బోర్డు అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులందరూ ఆర్గానిక్‌ పద్ధతిలో కాఫీ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఈమేరకు కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు నివారణకు రసాయనిక పద్ధతులను సిఫారసు చేయడం లేదన్నారు. తెగులు నివారణకు బెవేరియా బెస్సియానా శిలింద్రరం ద్వారా బోరర్‌ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈశిలింద్రం మొక్కలపై పిచికారీ చేయడం వల్ల ఆడ కీటకాలు చనిపోతాయన్నారు. ప్రస్తుతం అరకులోయ, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో మాత్రమే కాఫీ బెర్రీ బోరర్‌ బయటపడిందన్నారు. ఇతర ప్రాంతాల రైతుల తోటల్లో ఎక్కడైన ఈతెగులు ఉందా? అనే విషయాలను గుర్తించేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ అధికారులు, ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారన్నారు. ఈకమిటీ సభ్యులు అరకులోయ, మినుములూరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో సోమవారం నుంచి రైతుల కాఫీ తోటలను పరిశీలిస్తారని, ఎక్కడైన తెగులు గుర్తిస్తే వెంటనే నివారణ చర్యలు ప్రారంభిస్తారన్నారు. ఈకార్యక్రమంలో కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ వెంకటస్వామి, శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌, స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి చెట్టి బిందు, కేంద్ర కాఫీ బోర్డు జేఎల్‌వో నాగేశ్వరరావు, టీవోటీవో ఓంప్రసాద్‌, టాటా ట్రస్టు నిపుణుడు డాక్టర్‌ అప్పారావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో రాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:51 PM