నేరాల నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:38 AM
నేరాలను అదుపు చేయడానికి, ప్రజల భద్రతకు పోలీస్ యంత్రాంగం సాంకేతిక సహకారంతో ముందుకు వెళుతున్నది. హోటళ్లు, లాడ్జిలు, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లలో రూమ్‌లు అద్దెకు తీసుకొనే అతిథుల కోసం ‘సేఫ్ స్టే’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. లాడ్జిల నిర్వాహుకుల మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, అక్కడ పని చేసే సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లాలో 80 లాడ్జిలలో యాప్ అందుబాటులోకి తెచ్చారు.
అందుబాటులోకి ‘సేఫ్ స్టే’ యాప్
- జిల్లాలోని లాడ్జిలు, హోటళ్లలో దిగే వారి వివరాలు యాప్‌లో నమోదు
- నేర చరిత్ర ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్‌కి అలర్ట్
వెంటనే అక్కడకు వెళ్లి తనిఖీలు
నర్సీపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): నేరాలను అదుపు చేయడానికి, ప్రజల భద్రతకు పోలీస్ యంత్రాంగం సాంకేతిక సహకారంతో ముందుకు వెళుతున్నది. హోటళ్లు, లాడ్జిలు, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లలో రూమ్‌లు అద్దెకు తీసుకొనే అతిథుల కోసం ‘సేఫ్ స్టే’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. లాడ్జిల నిర్వాహుకుల మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, అక్కడ పని చేసే సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లాలో 80 లాడ్జిలలో యాప్ అందుబాటులోకి తెచ్చారు. అన్ని లాడ్జిలు, హోటళ్లలో సేఫ్ స్టే యాప్ సిక్కర్లు అతికించారు. లాడ్జిలో దిగే అతిథుల చిరునామా, ఫోన్ నంబరు, ఫొటో, ఆధార్ నంబరు వివరాలను సేఫ్ స్టే యాప్‌లో సిబ్బంది నమోదు చేస్తారు. నేర చరిత్ర ఉన్నవారు లాడ్జిలో రూమ్‌లు తీసుకుంటే... సేఫ్ స్టే యాప్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి అలర్ట్ సిగ్నల్ వెళుతుంది. పోలీస్ అధికారులు వెంటనే లాడ్జికి వెళ్లి తనిఖీ చేస్తారు. నేరస్థుల సమాచారంతో సరిపోల్చి అనుమానాస్పద వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటారు. ఈ యాప్ అందుబాటులోకి రాకముందు లాడ్జిలు, హోటళ్లు, అతిథిగృమాల్లో దిగే అనుమానాస్పధ వ్యక్తులు, నేరస్థుల కోసం పోలీసులు భౌతికంగా తనిఖీలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవరసరం లేదు. యాప్ నుంచి అలర్ట్ వచ్చినప్పుడు లాడ్జికి వెళ్లి తనిఖీ చేస్తే సరిపోతుంది. నేరాలను అదుపు చేయడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి ఈ యాప్ చాలా ఉపయోగ పడుతుందని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రోజూ యాప్ నుంచి అలర్ట్‌లు వస్తున్నాయని, సీఐలు, ఎస్‌ఐలు వెళ్లి తనిఖీ చేస్తున్నారని చెప్పారు.