Share News

అపిడమిక్‌ సీజన్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:44 PM

అపిడమిక్‌ సీజన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా అన్నారు.

అపిడమిక్‌ సీజన్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు
ప్రత్యేక శిబిరంలో ఓపీని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

సకాలంలో వైద్య సేవలందించాలని ఆదేశాలు

మలేరియా కేసులు నమోదైన గ్రామాల్లో

దోమల మందు పిచికారీ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్‌ బాషా

చింతపల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): అపిడమిక్‌ సీజన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా అన్నారు. శనివారం లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చింతపల్లి జాతరలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరం, ఐసీడీఎస్‌ స్టాల్‌ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు అపిడమిక్‌ సీజన్‌గా పరిగణించడం జరుగుతుందని, ఈ ఆరు నెలల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుంటాయన్నారు. రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు. పీహెచ్‌సీ పరిధిలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి మలేరియా అదుపులో వుందని, గత ఏడాది మలేరియా కేసులు నమోదైన గిరిజన గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నామన్నారు. మాత, శిశు మరణాలు నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామన్నారు. గర్భిణులందరూ ఆస్పత్రిలో ప్రసవం పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులు వ్యాధి సోకిన వెంటనే ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందాలన్నారు. వ్యాధులపై నిర్లక్ష్యం చేయరాదని, పసర మందులు, నాటు వైద్యానికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు భవాని, డీకే హిమబిందు, శివప్రసాద్‌, ఎంపీహెచ్‌ఈవో గుల్లెలి సింహాద్రి పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:44 PM