రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:19 AM
కేజీహెచ్‌లో డయాలసిస్ చేయించుకునే కిడ్నీ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ వాణి పేర్కొన్నారు. ‘పడకేసిన డయాలసిస్ యూనిట్లు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు.
పాడైన డయాలసిస్ మెషీన్ల
స్థానంలో కొత్తవి తీసుకుంటాం
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో డయాలసిస్ చేయించుకునే కిడ్నీ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ వాణి పేర్కొన్నారు. ‘పడకేసిన డయాలసిస్ యూనిట్లు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. నెఫ్రాలజీ విభాగానికి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. విభాగాధిపతితో చర్చించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆమె ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఆవరణలో నెఫ్రో ప్లస్ ఆధ్వర్యంలో రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, అందుకోసం 22 మెషీన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటి ద్వారా ప్రతిరోజూ 55 నుంచి 60 వరకూ సెషన్స్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నెఫ్రాలజీ విభాగంలో ఎనిమిది మెషీన్స్ ఉంటే, వాటిలో ఐదు కొన్నిరోజుల నుంచి పనిచేయడం లేదన్నారు. మూడు మెషీన్స్ సహాయంతో రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. మెషీన్స్ పాడైన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అంటే హీమోడయాలసిస్‌కు బదులుగా అక్యూట్ పెరిటోనియల్ డయాలసిస్ చేయిస్తున్నట్టు వెల్లడించారు. పాడైన మెషీన్లు స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఎన్‌టీపీసీ సంస్థ కొత్తగా పది డయాలసిస్ మెషీన్లు అందించేందుకు ముందుకువచ్చిందన్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా డయాలసిస్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.