పట్టుపరిశ్రమ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:23 PM
గిరిజన ప్రాంతంలో పట్టుపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు.
ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ
పలువురు గిరిజన రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ
పాడేరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో పట్టుపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. జిల్లా పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గిరిజన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇతర రైతుల కంటే పట్టురైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చునన్నారు. గతంలో పాడేరు ప్రాంతం నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలకు పట్టుగూళ్లు, దారం సరఫరా జరిగేందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ, ఆయా పోస్టులు భర్తీ కాకపోవడం వంటి కారణాలతో క్రమంగా పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గిందన్నారు. అయినప్పటికీ జిల్లాలో సుమారుగా 400 మంది రైతులు 800 ఎకరాల్లో మల్బరీ సాగు చేపడుతున్నారని, దానిని మరింతగా పెంచేందుకు రైతులు ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా 5 యూనిట్‌లకు చెందిన రైతులకు యంత్ర పరికరాలు, 156 యూనిట్‌లకు చెందిన రైతులకు రోగ నివారణ మందులు, 12 యూనిట్‌లకు చెందిన రైతులకు రేరింగ్ పరికరాలను ఐటీడీఏ పీవో శ్రీపూజ అందించారు. అనంతరం పాడేరులో పట్టుపరిశ్రమ కేంద్రంలో పట్టుగూళ్ల పెంపకం, పట్టు దారం తీయడం వంటి ప్రక్రియలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టుపరిశ్రమ అధికారి అప్పారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, పట్టు పరిశ్రమాధికారి జి.సన్యాసిరావు, సిబ్బంది, గిరిజన రైతులు పాల్గొన్నారు.