మేయర్ తనిఖీలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:57 AM
మేయర్ పీలా శ్రీనివాసరావు గురువారం రాత్రి పారిశుధ్య పనులు చేపడుతున్న తీరును తనిఖీ చేశారు.
ఆర్కే బీచ్‌రోడ్డు, రుషికొండ బీచ్‌లో పారిశుధ్య పనులు పరిశీలన
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
మేయర్ పీలా శ్రీనివాసరావు గురువారం రాత్రి పారిశుధ్య పనులు చేపడుతున్న తీరును తనిఖీ చేశారు. ఆర్కే బీచ్‌తోపాటు సాగర్‌నగర్ బీచ్‌లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో పారిశుధ్య కార్మికులతో మేయర్ మాట్లాడి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. రుషికొండ వద్ద సందర్శకులతో మాట్లాడి బీచ్‌లో పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. జాతీయస్థాయి సదస్సులు తరచూ జరుగుతున్నాయని, ఆ విషయం దృష్టిలో పెట్టుకుని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్, జోనల్ కమిషన్ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ పరీక్షలకు 133 కేంద్రాలు
మొత్తం విద్యార్థులు 29,300 మంది
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9,300,
ప్రైవేటు విద్యార్థులు 20వేలు
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 133 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 9,300 మంది, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 20 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఫీజు చెల్లించడానికి బుధవారంతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలపై జిల్లా విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని యాజమాన్యాలకు చెందిన 105 ఉన్నత పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. అన్ని రకాల సదుపాయాలు అంటే పరీక్షలు రాసేందుకు వీలుగా డెస్క్‌లు, ఫ్యాన్లు, లైటింగ్, మరుగుదొడ్లు ఉన్న ప్రైవేటు పాఠశాలలను కూడా కేంద్రాలుగా ఎంపికచేశారు. గతంలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షలు నిర్వహించేవారు. అయితే విద్యార్థులకు అన్ని వసతులు ఉన్న పాఠశాలల్లోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
కాగా పరీక్షల నిర్వహణకుగాను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని జిల్లా విద్యాశాఖకు సంబంధం లేకుండా పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ స్వయంగా నియమిస్తోంది. జిల్లాలో అర్హులైన ఉపాధ్యాయుల వివరాలను జిల్లా విద్యాశాఖ అమరావతిలోని కమిషనరేట్‌కు పంపాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్ల నుంచి చీఫ్ సూపరింటెండెంట్ల వరకు జంబ్లింగ్ విధానంలో నియమించి కమిషనరేట్ ఆదేశాలు ఇస్తోంది.
గడచిన రెండు, మూడేళ్లతో పోల్చితే ఈ విద్యా సంవత్సరం సీబీఎస్‌ఈ విద్యార్థుల సంఖ్య పెరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. దీంతో పాఠశాల విద్యా శాఖ అమలుచేస్తున్న సిలబస్‌లో చదువుతున్న విద్యార్థులు 29 వేలకు తగ్గారని వివరించారు.
కొత్తవలస ప్రగతి కళాశాలలో పరీక్ష కేంద్రం రద్దు
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
ఏయూ దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించేలా వ్యవహరించిన విజయనగరం జిల్లా కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ‘ప్రహసనంగా ఏయూ దూరవిద్య పరీక్షలు’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై వర్సిటీ అధికారులు స్పందించారు. మాస్ కాపీయింగ్ జరిగినట్టు గుర్తించిన ప్రగతి కాలేజీకి పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు. ఆ కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన విద్యార్థులను గోపాలపట్నం పెట్రోల్ బంక్ సమీపాన గల అల్వార్‌దాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి కేటాయించారు. ఈ మేరకు దూర విద్య కేంద్రం డైరెక్టర్ అప్పలనాయుడు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
టెట్‌కు 91.76 శాతం హాజరు
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు మొత్తం 2,284 మందికి 2,096 (91.76 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 178 మంది గైర్హాజరయ్యారు. ఉదయంపూట పరీక్షకు 1,835 మందికిగాను 1,710 మంది, మధ్యాహ్నం పరీక్షకు 449 మందికిగాను 386 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ రెండు కేంద్రాలు సందర్శించారు.