Share News

మేయర్‌ వర్సెస్‌ కమిషనర్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:29 AM

మేయర్‌ వర్సెస్‌ కమిషనర్‌

మేయర్‌ వర్సెస్‌ కమిషనర్‌

కోడి వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్న

వారిపై కేసు నమోదు చేయాలని మేయర్‌ ఆదేశం

రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

కమిషనర్‌ వద్దనడంతోనే

అధికారులు వెనుకాడుతున్నారని పీలా అనుమానం

అంతకుముందు జోన్‌ల వారీగా సమావేశాలపై విభేదాలు

మేయర్‌కు కమిషనర్‌ నుంచి అందని సమాచారం

అందుకే కూటమి కార్పొరేటర్లు గైర్హాజరు?

తాజా పరిణామాలను స్థానికంగా ప్రజా ప్రతినిధులు,

ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం

(విశాఖపట్నం-ఆంఽధ్రజ్యోతి)

జీవీఎంసీ మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. తనకు కమిషనర్‌ తగిన గుర్తింపు ఇవ్వడం లేదని పీలా శ్రీనివాసరావు భావిస్తున్నారు. తాజాగా కోడి వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తూ పట్టుబడిన వాహనాలపై కేసులు నమోదు చేయాలని మేయర్‌ స్వయంగా అధికారులను ఆదేశించారు. అయినా ఇంతవరకూ కేసులు నమోదుచేయలేదు. అందుకు కమిషనరే కారణమని మేయర్‌తోపాటు టీడీపీకి చెందిన కార్పొరేటర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కమిషనర్‌ తీరును కూటమి ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నారు.

రెండు నెలల కిందట కేతన్‌గార్గ్‌ జీవీఎంసీ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆదిలో మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లతో సఖ్యతగానే ఉన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. తమను కమిషనర్‌ కనీసం పట్టించుకోవడం లేదని, సమస్యలు చెప్పుకోవడానికి వెళితే గంటల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారంటూ కార్పొరేటర్లు బహిరంగంగానే ఆరోపించారు. దీనిపై మేయర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ జోన్‌ల వారీగా కార్పొరేటర్లు, అధికారులతో సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ముందుగా గత నెల 19న భీమిలి జోన్‌లో తొలిసమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మిగిలిన జోన్‌ల వారీగా సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. అయితే దీనిగురించి కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధికారులతోపాటు కార్పొరేటర్ల వద్ద తన అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు తెలిసింది. మేయర్‌కు తెలియకుండా జోన్‌ల వారీగా కార్పొరేటర్లతో సమావేశాలు పెట్టడం అంటే తనను కించపరచడమేనని పీలా ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి సమావేశాలకు కూటమి కార్పొరేటర్లు హాజరుకావద్దని ఆదేశించారని, అందువల్లే భీమిలి జోన్‌లో జరిగిన సమావేశానికి ఎవరూ హాజరవలేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కమిషనర్‌ దృష్టికి చేరడంతో మిగిలిన జోన్‌ల సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కొందరు కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మేయర్‌కు, కమిషనర్‌కు మధ్య పొరపొచ్ఛాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలావుండగా నగరంలో తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్న కోడివ్యర్థాల తరలింపు వ్యవహారం ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టులు దక్కించుకున్నవారు కోడి వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు కాకుండా చేపల చెరువులకు తరలిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది అనధికార వ్యక్తులు, రౌడీషీటర్లను పెట్టుకుని దౌర్జన్యంగా దుకాణాల నుంచి కోడి వ్యర్థాలను సేకరించి చేపల చెరువులకు విక్రయించుకుంటున్నారు. ఇందుకు కొందరు కార్పొరేటర్లు, అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో కోడి వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్న వాహనాలను పట్టుకోవాలని అధికారులను మేయర్‌ ఆదేశించారు. గత 20 రోజుల్లో సుమారు 30 వాహనాలను అధికారులు పట్టుకున్నారు. వాటిలో మొదట పట్టుకున్న రెండు వాహనాలపై పీఎం పాలెం స్టేషన్‌లో కేసు నమోదుకాగా మిగిలిన వాహనాలను ముడసర్లోవ డంపింగ్‌ యార్డు వద్ద ఉంచారు. వాటిపై కూడా కేసులు నమోదు చేయాలని అధికారులను మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. కానీ ఇంతవరకూ ఆ వాహనాలపై కేసు నమోదు చేయకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. తన మాటను పట్టించుకోవద్దంటూ అధికారులకు కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారని, అందుకే కేసులు పెట్టడం లేదని మేయర్‌ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కమిషనర్‌ తీరు ఇలాగే ఉంటే కౌన్సిల్‌లో తమకు ఇబ్బంది తప్పదని ఆందోళన చెందుతున్న మేయర్‌తోపాటు కూటమి కార్పొరేటర్లు నగరంలోని ప్రజా ప్రతినిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 01:29 AM