Share News

గణితం-1, ఫిజిక్స్‌-2 పేపర్లు కఠినం

ABN , Publish Date - May 19 , 2025 | 12:44 AM

దేశంలో ఐఐటీ/తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నగరంలో పది కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది.

గణితం-1, ఫిజిక్స్‌-2 పేపర్లు కఠినం

  • విద్యా నిపుణుడి విశ్లేషణ

  • ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌

విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):

దేశంలో ఐఐటీ/తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నగరంలో పది కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఉదయం పేపర్‌ 180 మార్కులు, మధ్యాహ్నం పేపర్‌ 180 మార్కులకు ప్రశ్నపత్రాలను రూపొందించారు. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించి ఉదయం 48, మధ్యాహ్నం 48 ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టుకు 120 మార్కుతో ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఉదయం ఇచ్చిన పేపరులో గణితం-1, మధ్యాహ్నం ఇచ్చిన పేపరులో ఫిజిక్స్‌-2లో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ డీన్‌ ఎస్‌.రఘకుమార్‌ తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ మేరకు ప్రశ్నపత్రాలను విశ్లేషించినట్టు ఆయన పేర్కొన్నారు. ఉదయం పేపరులో ఫిజక్స్‌ కొంతవరకు బాగానే ఉందని, కెమిస్ట్రీలో ప్రశ్నలు సులువుగా ఉన్నాయన్నారు. మధ్యాహ్నం పేపరులో ఫిజిక్స్‌ ప్రశ్నపత్రం కఠినంగా ఉందని, మేథమెటిక్స్‌, కెమిస్ట్రీ బాగానే ఉందని విద్యార్థులు తెలిపారన్నారు. కాగా నగరంలోని పది కేంద్రాలకు ఉదయం ఏడు గంటలకు విద్యార్థులు చేరుకున్నారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థినులకు మాత్రం ముక్కుపుడుక, చెవి దుద్దులు, రింగులు, గొలుసులతో అనుమతించలేదు. వాటిని తొలగించిన తరువాతే అనుమతించారు. ఈ పరీక్షలకు నగరంలోని అన్ని కేంద్రాల నుంచి సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Updated Date - May 19 , 2025 | 12:58 AM