Share News

‘ప్రైవేటు’కు ప్రసూతి కేసులు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:56 AM

పురుడు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన కేసులను ఆశా వర్కర్లు నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి, కమీషన్లు పొందుతున్నారని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

‘ప్రైవేటు’కు ప్రసూతి కేసులు
సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు. చిత్రంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

పీహెచ్‌సీల నుంచి తరలిస్తున్న ఆశా కార్యకర్తలు

ఒక్కో కేసుకు రూ.5 వేల చొప్పున కమీషన్లు

ఆధారాలతోనే చెబుతున్నానన్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆదేశం

ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పురుడు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన కేసులను ఆశా వర్కర్లు నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి, కమీషన్లు పొందుతున్నారని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ పీహెచ్‌సీల నుంచి 2023-24లో 398 ప్రసూతి కేసులు, 2024-25లో 498 ప్రసూతి కేసులను నర్సీపట్నంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని గణాంకాలతో సహా వివరించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఒక్కో ప్రసూతి కేసుకు రూ.5 వేల చొప్పున ఆశా కార్యకర్తలకు కమీషన్లుగా ఇస్తున్నారని, అన్ని ఆధారాలతోనే చెబుతున్నానని అన్నారు. ఆయా ప్రైవేటు ఆస్పత్రుల వద్ద వున్న సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించామని, ఏ ఆశా కార్యకర్త, ఏ ఆస్పత్రికి, ఎంత మంది గర్భిణులను తీసుకువెళ్లారో చెప్పమంటే చెబుతానని అన్నారు. ఏరియా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పీహెచ్‌సీల నుంచి ప్రసూతి కేసులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జ్యోతిని ఆయన ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో ఉన్న రూ.70 లక్షలను ఆస్పత్రి అవసరాలకు వినియోగించాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాశారదకు సూచించారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా కొత్త బోరు వేయించాలని ఆదేశించారు. ఆస్పత్రికి ప్రతీ నెలా కరెంటు బిల్లు ఎంత వస్తున్నదని ఆయన ప్రశ్నించగా.. రూ.2 లక్షలు వస్తున్నదని, అయితే సోలార్‌ యూనిట్‌ ఉండడంతో రూ.80 వేలు చెల్లిస్తే సరిపోతున్నదని అధికారులు తెలిపారు. కొత్త ఓపీ విభాగం భవనానికి సోలార్‌ అమర్చడానికి ఎంత అవుతుందని ప్రశ్నించగా, రూ.20 లక్షలు అవుతుందని సంబంధిత డీలర్‌ చెప్పారని సూపరింటెండెంట్‌ తెలిపారు. ఇంకా ఒకరిద్దరు డీలర్లతో మాట్లాడితే రూ.2-3 లక్షలు తగ్గే అవకాశం ఉందని, వెంటనే సోలార్‌ ఏర్పాటు చేయాలని, కరెంటు బిల్లు భారం ఇంకా తగ్గిపోతుందని అన్నారు. ఏరియా ఆస్పత్రికి అవసరమైన వైద్య సిబ్బందిని మంజూరు చేయాలని డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాస్‌ను ఆదేశించారు. గచ్చపువీధి వైపు ఉన్న పోస్ట్‌మార్టం గది వల్ల దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రత్యామ్నాయం ఆలోచించాలని స్పీకర్‌ సూచించారు. గొలుగొండ మండలం చీడిగుమ్మల పీహెచ్‌సీ చిన్న గదిలో, సచివాలయం పెద్ద భవనంలో ఉందని, వీటిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ సూచించారు. సీఎస్‌ఆర్‌ నిధులతో ఏరియా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వార్డుల్లో బెడ్‌లకు రోజుకో రంగు చొప్పున ఏడు రంగుల బెడ్‌ సీట్లు వాడితే బాగుంటుందని, ఆరు రోజులు బెడ్‌ షీట్లు ఇవ్వడానికి దాతలు మందుకు వచ్చారని, ఏడో రోజు బెడ్‌ షీట్లకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని స్పీకర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Apr 09 , 2025 | 12:56 AM