Share News

మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధి వేగవంతం

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:04 AM

మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని, వీలైనంత తొందరలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ఆదేశించారు.

మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధి వేగవంతం

  • వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కమిషనర్‌లకు కలెక్టర్‌ ఆదేశం

  • వచ్చే నెల రెండో వారం నుంచి పనులు మొదలు పెట్టాలి

  • వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలి

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):

మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని, వీలైనంత తొందరలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ఆదేశించారు. ఆయన గురువారం వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కమిషనర్లు కేఎస్‌ విశ్వనాథన్‌, కేతన్‌గార్గ్‌, ఇతర అధికారులతో తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. వీఎంఆర్‌డీఎ పరిధిలో చేపట్టాల్సిన 25 మాస్టర్‌ప్లాన్‌ రోడ్లకు అవసరమైన భూమి, స్థానిక సమస్యలు, ప్రణాళికలపై పలు సూచనలు చేశారు. భూసేకరణ, టెండర్లు, టీడీఆర్‌ల జారీ ప్రక్రియలను నిబంధనలకు లోబడి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాయుతంగా పనులు చేపట్టాలని సూచించారు. టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసి వచ్చే నెల రెండో వారం నుంచి పనులు మొదలు పెట్టాలని నిర్దేశించారు. వచ్చే ఏడాది జూన్‌, జూలై నెలాఖరుకల్లా రోడ్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయాలన్నారు.

కన్వేయన్స్‌ డీడ్‌లకు త్వరితగతిన రిజిస్ట్రేషన్‌

వివిధ మార్గాల్లో కన్వేయన్స్‌ డీడ్‌ (ఆస్తి బదిలీ పత్రం) పొందిన లబ్ధిదారులకు త్వరితగతిన రిజిస్ర్టేషన్లు చేయాలని జోనల్‌ కమిషనర్లు, మండల స్థాయి రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలు 30, 45 ద్వారా చేపడుతున్న భూముల క్రమబద్ధీకరణతోపాటు కన్వేయన్స్‌ డీడల రిజిస్ర్టేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విశాఖ, భీమిలి రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ అంశాలపై సమీక్షించి మార్గదర్శకాలు జారీచేశారు. జీవో 27 మేరకు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, జీవో 30 ప్రకారం ఆక్రమణల క్రమబద్ధీకరణపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కన్వేయన్స్‌ డీడ్‌లకు సంబంధించి రోజుకు 30 రిజిస్ట్రేషన్లు లక్ష్యంతో ప్రతి తహశీల్దారు పనిచేయాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియ రెండు నెలల్లో పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు.

Updated Date - Aug 08 , 2025 | 01:04 AM