సెప్టెంబరులో మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు ప్రారంభం
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:35 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు.
అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశం
గిరి ప్రదక్షిణ భక్తులకు ఇబ్బంది లేకుండా హనుమంతవాక, వెంకోజీపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ప్రతిపాదన
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్‌లో వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ, అనకాపల్లి, విజయనగరం, బీచ్ కారిడార్‌ను అనుసంధానం చేస్తూ మొత్తం 25 కొత్త రహదారులు ప్రతిపాదించామని, ఏడింటికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆగస్టులో అన్ని టెండర్లు పూర్తిచేసి సెప్టెంబరు రెండో వారంలో పనులు ప్రారంభించాలన్నారు. 2026 జూన్, జూలై నాటికి అన్ని రహదారులు అందుబాటులోకి తేవాలన్నారు. జీవీఎంసీ, నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, సింహాచలం గిరిప్రదక్షిణ సమయంలో భక్తులు హనుమంతవాక, వెంకోజీపాలెం వద్ద హైవే దాటడానికి ఇబ్బంది పడుతున్నారని, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, భవిష్యత్తులో సమస్య రాకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆ రెండు చోట్ల వినూత్నంగా ఆలోచించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్,్గ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక-అచ్యుతాపురం రహదారిలో కంచె
ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేసిన స్టీల్‌ప్లాంటు యాజమాన్యం
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగింపు
గాజువాక, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
గాజువాక నుంచి అచ్యుతాపురం వెళ్లే మార్గంలో దుర్గానగర్ జంక్షన్ వద్ద శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఇనుప బారికేడ్లను ఏర్పాటుచేసింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ బి.శ్రీనివాసరావు రాత్రి పది గంటల ప్రాంతంలో పోలీసుల సహకారంతో వాటిని తొలగించారు. వివరాలిలా ఉన్నాయి.
ఈ రోడ్డు విషయమై కర్ణవానిపాలెం ప్రాంతానికి చెందిన వెంకటరమణకు, స్టీల్‌ప్లాంటు యాజమాన్యానికి మధ్య కోర్టులో వివాదం నడుస్తుంది. తన స్థలాన్ని స్టీల్‌ప్లాంటు యాజమాన్యం రహదారి కోసం తీసుకొని నష్టపరిహారం చెల్లించలేదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ జంక్షన్‌లో రహదారి అధ్వానంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా రోడ్డును మూసివేసేందుకు స్టీల్‌ప్లాంటు యాజమాన్యం సిద్ధమైంది.
వేలాది మందికి ఇదే ప్రధాన రహదారి..
స్టీల్‌ప్లాంటు ఉద్యోగులు, కార్మికులతో పాటు పరవాడ, అచ్యుతాపురం, ఎలమంచిలి, ఫార్మాసిటీ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు ఎక్కువగా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో రోడ్డును మూసేయడంపై వివాదం నెలకొనడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గాజువాక తహశీల్దార్ బి.శ్రీనివాసరావు శనివారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని ఒక పరిశీలించారు. స్థలానికి సంబంధించి పూర్తి వివరాలను సంబంధిత యజమానిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి పది గంటలకు ఇనుప బారికేడ్లను పోలీసుల సహకారంతో తొలగించారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.