Share News

పెళ్లింట్లో భారీ చోరీ

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:47 AM

జీవీఎంసీ 69వ వార్డు పరిధి వెంకటేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది.

పెళ్లింట్లో భారీ చోరీ

  • వెంకటేశ్వర కాలనీలో 700 గ్రాముల బంగారం, 3 కిలోల వెండితో పాటు రూ.20 లక్షల నగదును అపహరించుకుపోయిన దుండగులు

  • కుప్పకూలిన కుటుంబ సభ్యులు

  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గాజువాక క్రైమ్‌ పోలీసులు

అక్కిరెడ్డిపాలెం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ 69వ వార్డు పరిధి వెంకటేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది. కుమార్తె పెళ్లి కోసం ఇంట్లో భద్రపరిచిన 700 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి సామగ్రితో పాటు రూ.20 లక్షల నగదు చోరీకి గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చోరీకి గురైన మొత్తం విలువ రూ.కోటి వరకు ఉంటుందని అంచనా. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తున్న ఎస్‌.శ్రీనివాస్‌ కుటుంబంతో సహా వెంకటేశ్వర కాలనీలోని లక్ష్మి రెసిడెన్సీలోని రెండో అంతస్థులో ఉంటున్నారు. శ్రీనివాస్‌ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదరడంతో వచ్చే నెల 10వ తేదీన నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ లాకర్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి, ఇతర విలువైన వస్తువులను తెచ్చి ఇంట్లో భద్రపరిచారు. పెళ్లి పనుల్లో భాగంగా ఇంట్లో పెయింటింగ్‌ పనులు చేయించారు. దీంతో ఇళ్లంతా పెయింటింగ్‌ వాసన వస్తుండడంతో శనివారం రాత్రి దిగువ ఫ్లోర్‌ ఖాళీగా ఉండడంతో కుటుంబ సభ్యులందరూ అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి రెండో అంతస్థులోకి వచ్చి చూసేసరికి ఇంటి తాళం విరగ్గొట్టి ఉండడంతో పాటు లోపల సామాన్లు చిందరవందరగా పడివున్నాయి. అనుమానం వచ్చి లోపల ఉన్న బీరువా తెరిచి చూడగా అందులో భద్రపరిచిన 700 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కిలోల వెండి సామగ్రి, ఇతర విలువైన వస్తువులతో పాటు రూ.20 లక్షల నగదు, పట్టుచీరలు కనిపించకపోవడంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు గాజువాక క్రైమ్‌ సీఐ శ్రీనివాస్‌ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు వచ్చి వివరాలు సేకరించాయి. అదేవిధంగా సంఘటనా స్థలాన్ని క్రైమ్‌ డీసీపీ లతామాధురి, ఏసీపీ లక్ష్మణరావుతో పాటు సీసీఎస్‌ సీఐ కె.రామారావులు పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:47 AM