కోరుకొండలో భారీగా ఒడిశా మద్యం, సారా పట్టివేత
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:56 PM
మండలంలోని తాజంగి పంచాయతీ కోరుకొండ గ్రామంలో ఒడిశాకు చెందిన నాటుసారా, మద్యం బాటిళ్లను భారీ మొత్తంలో పట్టుకున్నట్టు అనకాపల్లి ఎన్‌ఫోర్సుమెంట్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి. జగదీశ్వరరావు తెలిపారు.
409 లీటర్ల సారా, 64.87 లీటర్ల మద్యం బాటిళ్లు స్వాధీనం
నలుగురు నిందితుల అరెస్టు
చింతపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి పంచాయతీ కోరుకొండ గ్రామంలో ఒడిశాకు చెందిన నాటుసారా, మద్యం బాటిళ్లను భారీ మొత్తంలో పట్టుకున్నట్టు అనకాపల్లి ఎన్‌ఫోర్సుమెంట్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి. జగదీశ్వరరావు తెలిపారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు అసిస్టెంట్ కమిషనర్ మహేశ్ కుమార్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్సుమెంట్ సూపరింటెండెంట్ సురేశ్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్టు చెప్పారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కోరుకొండలో వార రాజు, ఉర్ల సూరిబాబు, షేక్ మహమ్మద్ రఫీ, వల్లంగి రమణబాబు ఒడిశా నుంచి నాటుసారా, మద్యం బాటిళ్లను దిగుమతి చేసుకుని ప్రాంతీయ మార్కెట్‌లో విక్రయాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ దాడిలో ఒడిశాకు చెందిన 409 లీటర్ల నాటుసారా, 6.13 లీటర్ల మద్యం, 34.35 లీటర్ల బీర్లు, ఆంధ్రాకు చెందిన 24.3లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కోరుకొండకు నాటుసారా, మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రం జనతాబై గ్రామానికి చెందిన రాకేశ్‌కుమార్ సింగ్ అలియాస్ శివతోపాటు కోరుకొండకు చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా కోరుకొండకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. గిరిజన గ్రామాల్లో నాటుసారా, మద్యం విక్రయాలు నిర్వహిస్తే ఎక్సైజ్ అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ దాడుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ గిరిబాబు, వీర్రాజు, కానిస్టేబుళ్లు రమేశ్, సంతోష్ పాల్గొన్నారు.