Share News

హైడ్రో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:19 AM

మన్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా శుక్రవారం అరకులోయలో మహాగర్జన పేరుతో భారీ ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్‌ పార్కు నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

హైడ్రో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
అరకులోయలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల అనుమతులను వ్యతిరేకిస్తూ విల్లంబు ఎక్కుపెట్టిన గిరిజన సంఘ నేతలు

అరకులోయ మహాగర్జనకు తరలివచ్చిన గిరిజనులు

అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌

అరకులోయ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):మన్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా శుక్రవారం అరకులోయలో మహాగర్జన పేరుతో భారీ ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్‌ పార్కు నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. పలువురు గిరి మహిళలు బాణాలను ఎక్కుపెట్టి హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ.. మన్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు ఏ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులతో వేలాది మంది జలసమాధి అవుతారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ గిరిజనానికి నష్టదాయకమైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి భయాందోలనకు గురిచేయడం పరిపాటిగా మారిందన్నారు. గతంలో బాక్సై తవ్వకాలకు అనుమతులను ఇచ్చి గిరిజనులను నిరాశ్రయులను చేసే విధంగా వ్యవహరించిందని, గిరిజనమంతా ఐక్యంగా పోరాటం చేసి అడ్డుకున్నామన్నారు. హైడ్రో ప్రాజెక్టుకు ఎటువంటి సంప్రదింపులు, గ్రామసభలు, పెసా కమిటీలతో సంబంధం లేకుండా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. గిరిజనుల ఉనికిని, జీవనానికే ప్రమాదం చేకూర్చే హైడ్రో పవర్‌ప్రాజెక్టులకు అనుమతులివ్వడంపై తీవ్ర అసంతృప్తిని వారు వ్యక్తం చేశారు. ఈ అనుమతులకు సంబంధించిన జీవో నంబర్‌ 51ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టులను రద్దు చేయకుంటే తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు. ఈ ఆందోళనలో అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 01:19 AM