Share News

పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:05 AM

నగరంలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లుచేస్తోంది.

పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

30 దేశాల నుంచి ప్రతినిధులు

దేశంలో పలు రాష్ర్టాల నుంచి వందలాది మంది పారిశ్రామికవేత్తల రాక

26 హోటళ్లల్లో 1,200 గదులు బుకింగ్‌

వచ్చే నెల 14, 15 తేదీల్లో సదస్సు

13వ తేదీ రాత్రి అతిథులకు సీఎం విందు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

నగరంలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లుచేస్తోంది. సదస్సులో పాల్గొనాలని పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఇందుకోసమే సీఎం చంద్రబాబునాయుడు దుబాయ్‌లో, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.

మరోవైపు సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లుచేసేందుకు రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలను నియమించారు. అలాగే సదస్సు నిర్వహణ, వేదిక నిర్మాణం, అతిథులకు వసతి, రవాణా సదుపాయాల కోసం జిల్లా అధికారులతో కమిటీలు వేశారు. అన్ని శాఖల సిబ్బందికి విధులు అప్పగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో వేదిక నిర్మిస్తున్నారు. ప్రధాన వేదికతోపాటు రెండు సెమినార్‌ హాళ్లు ఇక్కడ ఏర్పాటుచేస్తున్నారు. సీఎం, కేంద్ర వాణిజ్య శాఖా మంత్రుల కోసం రెండు క్యాబిన్‌లు నిర్మిస్తారు. సుమారు 30 దేశాల నుంచి అంతర్జాతీయంగా పేరున్న కంపెనీల అధిపతులు, సీఈవోలు, ఎండీలు, ఇతర ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నారు.

వచ్చే నెల 14, 15 తేదీల్లో ప్రధాన వేదిక వద్ద సదస్సు జరగనున్నది. అయితే వచ్చే నెల 13వ తేదీనే సదస్సును నోవాటెల్‌ హోటల్‌లో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఆరోజు రాత్రి అతిథులకు విందు ఏర్పాటుచేశారు. చాలావరకు అతిథులు, ప్రతినిధులు 13వ తేదీనే నగరానికి వచ్చే అవకాశం ఉంది. అతిఽథుల కోసం 26 హోటళ్లలో 1,200 గదులు బుక్‌ చేశారు. అంతర్జాతీయంగా పేరున్న కంపెనీల సీఈవోలు/చైర్మన్ల కోసం బెంజ్‌ కార్లు ఏర్పాటుచేస్తున్నారు. నగరంలో ఉన్న బెంజ్‌ కార్లతోపాటు ఇతర ప్రాంతాల నుంచి మరికొన్ని సమకూర్చుకుంటున్నారు. కాగా సదస్సు ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈనెలాఖరులో లేదా వచ్చే నెల తొలివారంలో నగరానికి రానున్నారు. ఇంకా ఉన్నతాధికారులు విశాఖలోనే మకాం వేయనున్నారు. సదస్సు నేపథ్యంలో నగరంలో ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 01:05 AM