Share News

దూరవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:26 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షల్లో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. తమ వద్ద పరీక్షలు రాస్తున్న విద్యార్థుల నుంచి కొన్ని కాలేజీల యాజమాన్యాలు డబ్బులు వసూలు చేసి, ప్రశ్నపత్రాన్ని ముందుగానే లీక్‌ చేస్తున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాల యాజమాన్యం ఈ విధంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి నాలుగు వేలు నుంచి పది వేల రూపాయల వరకూ వసూలు చేసినట్టు తెలిసింది.

దూరవిద్య పరీక్షల్లో  మాస్‌ కాపీయింగ్‌

కొత్తవలస ప్రగతి డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీలో అక్రమాలు

ఒక్కో విద్యార్థి నుంచి నాలుగు వేల నుంచి

పది వేల రూపాయల వరకూ వసూలు

ముందుగానే విద్యార్థుల చేతికి ప్రశ్నపత్రం

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విద్యార్థుల చిట్‌చాట్‌

స్క్వాడ్‌ను పంపించామన్న డైరెక్టర్‌

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షల్లో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. తమ వద్ద పరీక్షలు రాస్తున్న విద్యార్థుల నుంచి కొన్ని కాలేజీల యాజమాన్యాలు డబ్బులు వసూలు చేసి, ప్రశ్నపత్రాన్ని ముందుగానే లీక్‌ చేస్తున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాల యాజమాన్యం ఈ విధంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి నాలుగు వేలు నుంచి పది వేల రూపాయల వరకూ వసూలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి కొందరు విద్యార్థులు ప్రగతి కాలేజీ పరీక్షా కేంద్రం ఎదురుగా ఉన్న జెరాక్స్‌ సెంటర్‌ వద్ద మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పరీక్షకు నాలుగు వేల రూపాయలు చెల్లించినట్టు ఒక అభ్యర్థి చెప్పగా, ఎవరి ద్వారా ఫీజు చెల్లించారో ఆ వీడియోలో విద్యార్థులు చర్చించుకుంటూ కనిపించారు. ఈ వీడియో బయటకు రావడంతో మరోసారి దూరవిద్య పరీక్షల నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ తరహా మాస్‌కాపీయింగ్‌కు సహకరించిన కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.

ప్రత్యేక ఏర్పాట్లు..

ఏయూ దూరవిద్య కేంద్రం బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి మొదటి, రెండు, మూడో సెమిస్టర్‌లతోపాటు 2019 నుంచి గత విద్యా సంవత్సరం వరకూ ఉన్న బ్యాక్‌లాగ్స్‌కు ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహిస్తోంది. ఇటు శ్రీకాకుళం నుంచి అటు గుంతకల్లు వరకూ 78 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. ఈ పరీక్షలకు పది వేల మందికిపైగా హాజరవుతున్నారు. అయితే పరీక్ష కేంద్రాలుగా ఉన్న కొన్ని కళాశాలల యాజమాన్యాలు ప్రశ్నపత్రాలను లీక్‌ చేస్తున్నాయి. కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీ నిర్వాహకులు డబ్బులు చెల్లించిన విద్యార్థులకు మాత్రమే ప్రశ్నపత్రాలను పంపినట్టు తెలిసింది. అదేవిధంగా వారందరినీ ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయించినట్టు చెబుతున్నారు. విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాసిన వెంటనే మైక్రో జెరాక్స్‌లను అక్కడ నుంచి తీసుకువెళ్లేలా ఆయాలను ఏర్పాటుచేసినట్టు తెలిసింది. పరీక్ష ప్రారంభమైన గంట మాత్రం జాగ్రత్తగా ఉండాలని, ఆ తరువాత మైక్రోజెరాక్స్‌లు తీసుకుని రాసుకోవాలని చెప్పినట్టు చెబుతున్నారు. ఇకపోతే, ఇదే కాలేజీకి చెందిన బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు సంబంధించి కూడా సెల్ఫ్‌ సెంటర్‌ను వేయించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. దూరవిద్యకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏరోజుకారోజు కాస్త ముందు పంపినట్టయితే అక్రమాలకు చెక్‌ చెప్పేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నిరంతరం తనిఖీలు చేస్తున్నాం

దూరవిద్య సంచాలకులు ప్రొఫెసర్‌ డీఏ నాయుడు

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తనిఖీలు నిర్వహిస్తున్నామని దూరవిద్య సంచాలకులు ప్రొఫెసర్‌ డీఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాలను ఏయూ నుంచి వెళ్లిన స్క్వాడ్‌ తనిఖీ చేయగా, ఎనిమిది మంది విద్యార్థులు పట్టుబడ్డారన్నారు. వారిపై తదుపరి చర్యలు తీసుకోవాలని పరీక్షల విభాగానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. అందులో ఏడుగురు చూచిరాస్తుండగా, ఇంకొకరు...వేరొకరి బదులు పరీక్ష రాస్తున్నట్టు గుర్తించడం జరిగిందన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 01:26 AM