విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:04 PM
మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ జీలుగులపాడులో ఆదివారం ఇంటి పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
అనంతగిరి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ జీలుగులపాడులో ఆదివారం ఇంటి పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీనికి సంబంధించి ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. వంతెనవానిపాలెం గ్రామానికి చెందిన కె.సురేశ్(34) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం జీలుగులపాడులోని ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పిట్టగోడను నిర్మిస్తుండగా, ప్రమాదవశాత్తూ అల్యూమినియం గజంబద్ధ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒక్కసారిగా కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. అతనిని అంబులెన్స్‌లో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సురేశ్ భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని ఉంచారు.