Share News

నడిరోడ్డుపై వివాహిత హత్య

ABN , Publish Date - Oct 16 , 2025 | 01:28 AM

నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక వివాహిత హత్యకు గురైంది. ఆమె నివాసానికి ఎదురు ఇంట్లో ఉండే వ్యక్తే పదునైన ఆయుధంతో గొంతుకోసి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది. అక్కయ్యపాలెం నందగిరి నగర్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రావణ సంధ్యారాణి అలియాస్‌ సోనూ (32) నందగిరి నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటుంది.

నడిరోడ్డుపై  వివాహిత హత్య
కుమారులిద్దరితో శ్రావణ సంధ్యారాణి (ఫైల్‌)

ఎదురింట్లో ఉండే వ్యక్తి ఘాతుకం

విచక్షణ కోల్పోయి పదునైన

ఆయుధంతో పీక కోసేసిన నిందితుడు

విశాఖపట్నం/అక్కయ్యపాలెం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక వివాహిత హత్యకు గురైంది. ఆమె నివాసానికి ఎదురు ఇంట్లో ఉండే వ్యక్తే పదునైన ఆయుధంతో గొంతుకోసి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది. అక్కయ్యపాలెం నందగిరి నగర్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రావణ సంధ్యారాణి అలియాస్‌ సోనూ (32) నందగిరి నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటుంది. సోనూకు ఎనిమిదేళ్ల వయస్సు గల ఇద్దరు (కవలలు) కుమారులు ఉన్నారు. ఇద్దరూ మానసిక వైకల్యంతో పుట్టడంతో శ్రావణ సంధ్యారాణి భర్త ఆమెను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై ప్రస్తుతం ఇద్దరి మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. శ్రావణ సంధ్యారాణి తండ్రి విశ్వేశ్వరరావు పోలీస్‌ శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మృతిచెందగా, తల్లి కూడా కొన్నాళ్ల క్రితం మృతిచెందారు. శ్రావణ సంధ్యారాణి ఒక కుమారుడిని హాస్టల్‌లో చేర్పించగా, మరొక కుమారుడు ఆమెతోనే ఉంటున్నాడు. ఇదిలావుండగా శ్రావణ సంధ్యారాణికి, ఆమె ఎదురింట్లో ఉంటున్న కార్పెంటర్‌ కండిపల్లి శ్రీనివాసరావు(36)కు కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో శ్రావణ సంధ్యారాణి వాకింగ్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. కొద్దిఅడుగుల దూరం వెళ్లేసరికి కొండమ్మ అనే మహిళ ఎదురుపడడంతో ఆమెతో మాట్లాడుతోంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన శ్రీనివాసరావు పదునైన ఆయుధంతో శ్రావణ సంధ్యారాణి మెడ కోసేశాడు. దీంతో ఆమె తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సంధ్యారాణితో మాట్లాడుతున్న మహిళ గట్టిగా కేకలు పెట్టింది. స్థానికులు అక్కడకు వచ్చేసరికి శ్రీనివాసరావు పరారైపోయాడు. స్థానికులు డయల్‌ 100కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో ఫోర్త్‌ టౌన్‌ సీఐ సీహెచ్‌ ఉమాకాంత్‌ అక్కడకు చేరుకుని 108కి ఫోన్‌ చేశారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంధ్యారాణికి ఒక సోదరుడు ఉన్నప్పటికీ అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. తమ అనేవారు ఎవరూ లేకపోవడంతో బుద్ధిమాంద్యం కలిగిన ఇద్దరు కవలల పరిస్థితి ఏమిటనేది అగమ్యగోచరంగా మారింది. వారిని తండ్రి వద్దకు చేర్చేలా పోలీసులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Oct 16 , 2025 | 01:28 AM