Share News

వివాహిత హత్య

ABN , Publish Date - May 03 , 2025 | 01:23 AM

వివాహితను దారుణంగా హత్య చేసి, నిర్జన ప్రదేశానికి తరలించి, పెట్రోలు పోసి దహనం చేసేందుకు యత్నించిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది.

వివాహిత హత్య

  • దాకమర్రి సమీప లే అవుట్‌లో మృతదేహం

  • పెట్రోలు పోసి దహనం చేసేందుకు యత్నించిన హంతకులు

  • పాక్షికంగా కాలిపోవడంతో లభించని ఆనవాళ్లు

  • కేసు నమోదు చేసిన పోలీసులు

  • ఆధారాలు సేకరించిన క్లూస్‌ టీమ్‌

  • విశాఖపట్నం లేదా విజయనగరం ప్రాంత వాసి అయి ఉంటారని అంచనా

భీమునిపట్నం (రూరల్‌) మే 2 (ఆంధ్రజ్యోతి):

వివాహితను దారుణంగా హత్య చేసి, నిర్జన ప్రదేశానికి తరలించి, పెట్రోలు పోసి దహనం చేసేందుకు యత్నించిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...భీమిలి మండలం దాకమర్రి సమీప ఫార్చ్యూన్‌ హిల్స్‌ లే అవుట్‌ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నార్త్‌ ఏసీపీ ఎస్‌.అప్పలరాజు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సగం కాలిన మృతదేహాన్ని పరిశీలించి, వయసు సుమారు 25 సంవత్సరాలుంటుందని, ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పెట్రోలు పోసి దహనం చేసేందుకు యత్నించి ఉంటారని భావిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని నిశితంగా పరిశీలించి వివాహితగా గుర్తించారు. విశాఖపట్నం లేదా విజయనగరం ప్రాంతాలకు చెందిన మహిళ అయి ఉంటుందని, అర్ధరాత్రి సమయంలో ఏదైనా వాహనంలో ఇక్కడికి తీసుకువచ్చి దహనం చేసేందుకు యత్నించి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. సగానికి పైగా కాలిపోవడంతో ఆనవాళ్లు లభించలేదని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. ఆనందపురం, పోతినమల్లయ్యపాలెం, పద్మనాభం, భీమిలి పోలీస్‌ సిబ్బందితో ఆరు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేసి, దర్యాప్తు బాధ్యతను అప్పగించినట్టు ఏసీపీ ఎస్‌.అప్పలరాజు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలిసే అవకాశముందని భీమిలి సీఐ బి.తిరుమలరావు తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 01:23 AM