ప్రతి 6 నెలలకు మారీటైమ్ సదస్సు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:55 AM
లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖపట్నంలో ఆరు నెలలకొకసారి మారీటైమ్ సదస్సు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు.
అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచన
డేటా సెంటర్‌గా అభివృద్ధి చెందనున్న విశాఖ
నగరంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు
విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖపట్నంలో ఆరు నెలలకొకసారి మారీటైమ్ సదస్సు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. నోవాటెల్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో ఆయన ఈ సూచన చేశారు. లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని ఇక్కడి పారిశ్రామికవేత్తలను కోరారు. గ్లోబల్ లాజిస్టిక్స్ వ్యయం 8 శాతం ఉండగా, భారతదేశంలో ఇది 13 శాతంగా ఉందని, ఈ వ్యయం బాగా దిగి రావడానికి అంతా కృషి చేయాలన్నారు. విశాఖలో జీఎంఆర్ సంస్థ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. విశాఖపట్నం డేటా సెంటర్‌గా నంబర్‌వన్ స్థానంలో ఉంటుందని, ముంబై, బెంగళూరు నగరాలను తలదన్నే డేటా సెంటర్లు వస్తాయన్నారు. సింగపూర్ నుంచి సీ కేబుల్ వస్తుందని చెప్పారు. త్వరలో అమరావతికి బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుందని చెప్పారు. స్టీల్ ఉత్పత్తుల రవాణా కోసం ప్రత్యేకంగా ఒక పోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. షిప్పింగ్ లైన్స్‌కు చెందిన త్రిపాఠి మాట్లాడుతూ, షిప్ రిపేర్లకు 200 నుంచి 300 ఎకరాలు కేటాయించాలని కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.