రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:32 PM
గంజాయి సాగు, రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు తమ రూటు మార్చారు. ఎండు గంజాయిని ప్యాకెట్‌లలో రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడుతుండడంతో వ్యూహాన్ని మార్చేసి లిక్విడ్ గంజాయిపై దృష్టి సారిస్తున్నారు.
సాగు, రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో
ఇతర మార్గాల అన్వేషణ
ఏవోబీ సరిహద్దు పల్లెల్లో
లిక్విడ్‌గా మార్చేసి ప్యాకెట్లుగా తయారీ
సులువుగా ఇతర ప్రాంతాలకు రవాణా
పక్కా సమాచారం ఉంటేనే పట్టుబడుతున్న పరిస్థితి
ఇటీవల పాడేరులో 3 కిలోలకు పైగా పట్టుబడడంతో అవాక్కైన ఎక్సైజ్ అధికారులు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
గంజాయి సాగు, రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు తమ రూటు మార్చారు. ఎండు గంజాయిని ప్యాకెట్‌లలో రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడుతుండడంతో వ్యూహాన్ని మార్చేసి లిక్విడ్ గంజాయిపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు నాలుగు ప్యాకెట్‌లలో 3 కిలోల 630 గ్రాముల లిక్విడ్ గంజాయిని తరలిస్తూ వండలం చినబాలన్న అనే వ్యక్తి అరెస్టు కాగా, వండలం కృష్ణారావు అనే వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనతో మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు లిక్విడ్ గంజాయి రవాణా వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ పబ్‌లో లిక్విడ్ గంజాయి వెలుగులోకి..
రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని పబ్‌పై పోలీసులు దాడి చేసి లిక్విడ్ గంజాయిని సరఫరా చేస్తున్న డుంబ్రిగుడ మండలం లోగిలి వాసి పాంగి నగేశ్‌ను అరెస్టు చేయడంతో లిక్విడ్ గంజాయి వ్యవహారం దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశఽమైంది. గతంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి ప్యాకెట్‌ల రవాణా జోరుగా సాగేది. అయితే గత కొన్నాళ్లుగా గంజాయి రవాణాపై ఎక్సైజ్, ఈగల్ టీం అధికారులు దృష్టి సారిస్తూ, ఎక్కడికక్కడ గంజాయిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో గంజాయిని నేరుగా రవాణా చేస్తే ఇబ్బంది పడతామని గుర్తించిన స్మగ్లర్లు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని పల్లెల్లోనే గంజాయిని లిక్విడ్‌గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని తెలుస్తున్నది. ఏవోబీలో గంజాయి లిక్విడ్‌ను తయారు చేసి, హైదరాబాద్, తమిళనాడుకు చెందిన డ్రగ్స్ పెడ్లర్స్‌కు కిలో రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. అలాగే గతంలోనూ పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో లిక్విడ్ గంజాయి పట్టుబడిన అనేక సంఘటనలున్నాయి.
25 కిలోల పచ్చి గంజాయితో ఒక కిలో లిక్విడ్ గంజాయి
లిక్విడ్ గంజాయి తయారీ సైతం చాలా కష్టతరంగా ఉంటుందని తెలుస్తున్నది. 25 కిలోల నాణ్యమైన శీలావతి రకం గంజాయి మొక్కలను వినియోగిస్తే కిలో లిక్విడ్ గంజాయి తయారవుతుంది. అలాగే నాసిరకమైతే 50 కిలోల గంజాయి మొక్కలతో ఒక కిలో లిక్విడ్ గంజాయి వస్తుంది. లిక్విడ్ గంజాయిని తయారు చేసేందుకు తమిళనాడు నుంచి ప్రత్యేక నిపుణులను ఇక్కడికి రప్పిస్తుంటారు. దాని కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఒక పరికరం, బాయిలర్, గ్యాస్ స్టౌవ్‌లను వినియోగిస్తారు. పచ్చి గంజాయి ఆకులను మెత్తగా రుబ్బేసి, దానిలో వైట్ పెట్రోల్‌లో గుర్తు తెలియని ఓ రసాయనం కలిపిన లిక్విడ్‌ను అందులో వేసి పాకంగా తయారయ్యే వరకు ఉడికిస్తారు. అది నల్లగా పాకంలా మారే వరకు ఉడికించి, అనుకున్న విధంగా పాకంగా మారిన లిక్విడ్ గంజాయిని కిలోల చొప్పున ప్యాకెట్‌లుగా చేస్తారు. ప్రస్తుతం ఏజెన్సీలో కిలో లిక్విడ్ గంజాయి రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ధర ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పక్కా సమాచారం ఉంటేనే..
గంజాయి పట్టుబడినంత సులభంగా లిక్విడ్ గంజాయి పట్టుబడదు. లిక్విడ్ గంజాయి రవాణా జరుగుతుందని పక్కా సమాచారం ఉంటేనే పట్టుబడే పరిస్థితి ఉంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా లిక్విడ్ గంజాయిని ఏవోబీ నుంచి దేశంలో ముఖ్యమైన నగరాలకు రవాణా చేస్తున్నట్టు తెలిసింది. పైగా కిలో లేదా రెండు కిలోల లిక్విడ్ గంజాయిని ఏదొక మార్గంలో తరలించడం సులభం. దీంతో స్మగ్లర్ల దృష్టి లిక్విడ్ గంజాయి తయారీపై పడింది. దీంతో లిక్విడ్ గంజాయిని తయారు చేసే తమిళనాడుకు చెందిన నిపుణులను ఏవోబీకి రప్పించి రహస్య ప్రదేశాల్లోనే వంద నుంచి రెండు వందల కిలోల లిక్విడ్ గంజాయిని తయారు చేసి, అప్పడప్పుడు కనిష్ఠంగా కిలో, రెండు కిలోలు, గరిష్ఠంగా ఐదు కిలోల చొప్పున ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడుతున్న కేసులను బట్టి తెలుస్తున్నది.
లిక్విడ్ గంజాయికి ప్రస్తుతం భారీ డిమాండ్
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం గంజాయి కంటే, లిక్విడ్ గంజాయికి భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. ముఖ్యంగా పబ్‌లు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలున్న నగరాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఏజెన్సీలోని పలువురు స్మగ్లర్లు మూడో కంటికి తెలియకుండా మారుమూల ప్రాంతాల్లో లిక్విడ్ గంజాయిని తయారు చేయించి, నగరాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఓ పబ్ వ్యవహారంలో నమోదైన కేసులో డుంబ్రిగుడ మండలం లోగిలి గ్రామానికి చెందిన పాంగి నగేశ్ అనే వ్యక్తిని నార్కోటెక్ అధికారులు అరెస్టు చేయడంతో మన్యం నుంచే లిక్విడ్ గంజాయి రవాణా జరుగుతున్నది పక్కాగా నిర్ధారణ అయింది. అలాగే నగేశ్ మరో పదిహేను మందితో ఒక ముఠాగా ఏర్పడి ఈ అక్రమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని హైదరాబాద్‌లోని నార్కోటెక్, టాస్క్‌ఫోర్సు అధికారులు గుర్తించారు. ఏజెన్సీలో ఎస్‌ఈబీ అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తే పాంగి నగేశ్ వంటి స్మగ్లర్లు అనేక మంది వెలుగులోకి వస్తారనే వాదన బలంగా వినిపిస్తున్నది. అలాగే తాజాగా పాడేరు మండలం కరకపుట్టు కూడలి వద్ద జి.మాడుగులకు చెందిన వ్యక్తుల వద్ద పట్టుబడిన 3 కిలోల 630 గ్రాముల లిక్విడ్ గంజాయి కేసుపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే స్మగ్లర్లకు చెందిన మరిన్ని ఆధారాలు లభించే అవకాశం లేకపోలేదు.