Share News

అమాయకులతో గంజాయి సాగు

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:32 PM

అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

అమాయకులతో గంజాయి సాగు
మాట్లాడుతున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

గిరిజనులను మోసం చేస్తున్న స్మగ్లర్లు

పట్టుబడితే ఆరు నెలలు నో బెయిల్‌

రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

2 కోట్ల పండ్ల మొక్కలు పంపిణీ : మంత్రి సంధ్యారాణి

నాలుగేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు : కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు : ఈగల్‌ ఐజీ రవికృష్ణ

పాడేరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ‘చైతన్యం- 2005, గంజాయి సాగు రహితమే లక్ష్యం’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇక్కడ గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని స్మగ్లర్లు వారితో గంజాయి సాగు చేయిస్తున్నారన్నారు. ఎవరైనా గంజాయితో పట్టుబడితే ఆరు నెలలు బెయిల్‌ రాదన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే 10 నుంచి 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. ఇటీవల విశాఖపట్నం సెంట్రల్‌ జైల్‌ను సందర్శించినపుడు అక్కడ పరిశీలిస్తే.. 900 మంది గంజాయి నేరస్థులుంటే, వారిలో 700 మంది గిరిజనులే ఉన్నారన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 2 కోట్ల పండ్ల మొక్కలను గిరిజన రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, మరికొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యజ్ఞం చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్‌ ఏఎన్‌.దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో రూ.54 కోట్ల వ్యయంతో 35 వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న నాలుగేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు పెంపకాన్ని విస్తరిస్తున్నామన్నారు. జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ మాట్లాడుతూ.. డ్రోన్ల సాయంతో 93 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించామన్నారు. అలాగే గంజాయి సాగు చేస్తున్న 325 కుటుంబాలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ పంటల దిశగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈగల్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు. ఒడిశా నుంచి అల్లూరి జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నదని, దానిని పూర్తిస్థాయిలో అరికడతామన్నారు. ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో గంజాయి సాగు, రవాణాలకు ఆస్కారమే లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, విజయనగరం రీజియన్‌ ఆర్టీసీ చైర్మన్‌ సియ్యారి దొన్నుదొర, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, ఈగల్‌ ఎస్‌పీ కె.నగేశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన అరకులోయ పార్లమెంటరీ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య, ఐటీడీఏ ఏపీవో ఎంవెంకటేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగర్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:32 PM