కనకమహాలక్ష్మి ఆలయంలో రేపటి నుంచి మార్గశిర మాసోత్సవాలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:38 AM
కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 19వ తేదీ వరకూ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. గురువారాల్లో భక్తజనసందోహం తరలివస్తారు. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
కనకమహాలక్ష్మి ఆలయంలో రేపటి నుంచి మార్గశిర మాసోత్సవాలు
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
అన్నదానం, ప్రసాదాలపై తయారీపై దృష్టి
ఫుడ్ సేఫ్టీ అధికారులతో
తనిఖీ చేయించాలని ఆదేశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 19వ తేదీ వరకూ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. గురువారాల్లో భక్తజనసందోహం తరలివస్తారు. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ సోమవారం ఆలయానికి వచ్చి పరిసరాలన్నీ తిరిగి పలు సూచనలు చేశారు. ఆలయంలోనే సమావేశం నిర్వహించి ఏ విభాగం ఏయే బాధ్యతలు తీసుకోవాలో ఆదేశించారు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటుచేయాలని, తోపులాటలు లేకుండా, అడ్డగోలు దర్శనాలు లేకుండా క్రమపద్ధతిలో అన్నీ నిర్వహించాలని పోలీసు అధికారులకూ సూచించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంగా చెప్పారు.
ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ తప్పనిసరి
ఈ ఆలయంలో ప్రసాదాలు, అన్నదానం నాణ్యత తగ్గిపోయిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆయా విభాగాల నుంచి నెలవారీ మామూళ్లు ఆశించడమే కారణమనే అభియోగాలు వచ్చాయి. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. సిబ్బంది విధుల్లో మార్పులు చేశారు. ఇప్పుడు మార్గశిర మాసం నెల రోజులు జగన్నాథస్వామి ఆలయంలో రోజూ వేలాది మందికి అన్నదానం నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో ప్రసాదాలు తయారుచేస్తారు. వీటిలో నాణ్యత తగ్గితే చెడ్డపేరు వస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆలయ అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రసాదాలు, అన్నదానానికి ఉపయోగించే దినుసులు, వాటితో తయారయ్యే ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేయించి, సర్టిఫికెట్ తనకు పంపాలని సూచించారు. దీంతో ఆలయ అధికారుల గుండెల్లో రాయి పడింది. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్సవాల సమయంలో ఎటువంటి చెడ్డపేరు రాకుండా చూడాలని జిల్లా అధికారులు ఆదేశించడంతో ఆ వంకతో తమను ఆలయ అధికారి ఏ రకమైన ఇబ్బందులకు గురిచేస్తారోనని సిబ్బంది భయపడుతున్నారు. ఏ తప్పు తమపైకి నెట్టి ఎటువంటి చర్యలు చేపడతారోనని ఆందోళన చెందుతున్నారు.