Share News

ఏసీబీ వలలో మారేడుపూడి వీఆర్వో

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:52 AM

భూమి మ్యూటేషన్‌కు రూ.20 వేలు లంచం తీసుకుంటూ మారేడుపూడి వీఆర్వో ఎం.సూర్యనారాయణ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

ఏసీబీ వలలో మారేడుపూడి వీఆర్వో
నగదుతో పట్టుబడిన వీఆర్వో సూర్యనారాయణ

- రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

అనకాపల్లి టౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): భూమి మ్యూటేషన్‌కు రూ.20 వేలు లంచం తీసుకుంటూ మారేడుపూడి వీఆర్వో ఎం.సూర్యనారాయణ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

అక్కిరెడ్డివానిపాలెం గ్రామానికి చెందిన సాలాపు సంజీవరావుకు 24 సర్వే నంబర్లలో కలిపి మొత్తం మూడున్నర ఎకరాల భూమి ఉంది. సంజీవరావు మే 30వ తేదీన మరణించారు. ఆయన పేరున ఉన్న ఆ భూమిని తన తల్లి దేముడమ్మ పేరున మార్చాలని కుమారుడు శ్రీను సెప్టెంబరులో వీఆర్వోకు దరఖాస్తు చేసుకున్నారు. 24 సర్వే నంబర్లకు సంబంధించి 19 సర్వే నంబర్లలోని భూమికి వీఆర్వో మ్యూటేషన్‌ చేశారు. మిగిలిన ఐదు సర్వే నంబర్లలో ఉన్న భూమిని మ్యూటేషన్‌ చేయడానికి రూ.50 వేలు లంచం అడిగారు. బుధవారం మధ్యాహ్నం వీఆర్వోను శ్రీను కలిసి రూ.20 వేలు ఇస్తానని చెప్పడంతో వీఆర్వో అంగీకరించారు. అయితే లంచం ఇవ్వడానికి మనసు అంగీకరించక శ్రీను బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శ్రీను గురువారం తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చిన వీఆర్వో సూర్యనారాయణకు రూ.20 వేలు లంచం ఇవ్వగా, అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ, ఇతర సిబ్బంది వీఆర్వోను అరెస్టు చేశారు. గతంలో కూడా ఆయనపై అభియోగాలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటిపై కూడా విచారణ చేస్తామని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. వీఆర్వోను శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నామన్నారు. అంతేకాకుండా పెందుర్తి సమీపంలోని సుజాతనగర్‌లో గల వీఆర్వో ఇంట్లో కూడా ఏసీబీ అధికారి తనిఖీలకు వెళ్లినట్టు తెలిసింది.

Updated Date - Nov 28 , 2025 | 12:52 AM