Share News

మావోయిస్టుల బంద్‌ ప్రభావం నిల్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:39 PM

సీపీఐ మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్‌ ప్రభావం మండలంలో పెద్దగా కనిపించలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్‌ బసవరాజ్‌ అలియాస్‌ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఈ నెల 10న భారత్‌ బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మావోయిస్టుల బంద్‌ ప్రభావం నిల్‌
సీలేరు రామాలయం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు

తెరుచుకున్న దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు

పగటి పూట యథావిధిగా తిరిగిన బస్సులు

పోలీసుల విస్తృత తనిఖీలు

చింతపల్లి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): సీపీఐ మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్‌ ప్రభావం మండలంలో పెద్దగా కనిపించలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్‌ బసవరాజ్‌ అలియాస్‌ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఈ నెల 10న భారత్‌ బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం మండలంలో దుకాణాలు యఽథావిధిగా తెరుచుకున్నాయి. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలు తిరిగాయి. ప్రధాన కేంద్రాల్లోనూ యథావిధిగా జనసంచారం కనిపించింది. కేవలం రాత్రివేళ ఆర్టీసీ బస్సులు మాత్రమే తిరగలేదు. కాగా ప్రధాన కేంద్రాల్లో పోలీసులు వాహన తనిఖీలు విస్తృతం చేశారు.

కొయ్యూరులో..

కొయ్యూరు: మండలంలో మావోయిస్టుల బంద్‌ ప్రభావం కనిపించలేదు. బంద్‌ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి.

సీలేరులో..

సీలేరు: మండలంలో బంద్‌ ప్రభావం కనిపించలేదు. అయితే జీకేవీధి మండలం సీలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఐస్‌గెడ్డ జంక్షన్‌ వద్ద ఒడిశా నుంచి వచ్చీపోయే వాహనాలను ఆపి తనిఖీలు చేసి అనుమానితులను ప్రశ్నించారు. మావోయిస్టులు, వారి సానుభూతిపరులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పాడేరు నుంచి డొంకరాయి, రాజమహేంద్రవరం నుంచి సీలేరు నైట్‌ హాల్ట్‌ ఆర్టీసీ సర్వీసులను సీలేరు పోలీస్‌ గ్రౌండ్‌కు తరలించారు. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే నైట్‌ సర్వీసులను ముందుగానే డిపోల్లోనే నిలిపివేశారు. సీలేరులో రాత్రిపూట పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. రామాలయం వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పలు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తనిఖీలు చేసి వారి వివరాలు, ఆధార్‌ కార్డులను పరిశీలించారు. అయితే యథావిధిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి. దుకాణాలు తెరుచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు పగటి పూట యఽథావిధిగా తిరిగాయి.

Updated Date - Jun 10 , 2025 | 11:39 PM