Share News

లిచి సాగుకు మన్యం అనుకూలం

ABN , Publish Date - May 20 , 2025 | 11:19 PM

పాడేరు మన్యం లిచి సాగుకు అనుకూలమని ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్‌ఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటి వరకు లిచి సాగుపై చేసిన పరిశోధనలు విజయవంతం కావడంతో ఏజెన్సీ రైతులకు మొక్కలను అందించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్యంలో శాహి, బడాన మేలిజాతి రకాలుగా ఎంపిక చేశారు. తొమ్మిదేళ్ల వయస్సు కలిగిన ఒక్కొక్క మొక్క నుంచి 35 కిలోల లిచి పండ్ల దిగుబడి వస్తుంది.

లిచి సాగుకు మన్యం అనుకూలం
తోటలో విరగ్గాసిన లిచి పండ్లు

శాస్త్రవేత్తల పరిశోధనలు విజయవంతం

శాహి, బడాన రకాలు ఎంపిక

ఒక మొక్క నుంచి 35 కిలోల దిగుబడి

ఈ ఏడాది ఆర్డర్‌పై రైతులకు మొక్కలు పంపిణీ

చింతపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి):

గిరిజన ప్రాంత రైతులకు లిచి పంటను పరిచయం చేసేందుకు అధ్యయనం చేయాలని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని 2016వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం సూచించింది. ఈమేరకు విశ్వవిద్యాలయం అధికారుల సూచనల మేరకు చింతపల్లి శాస్త్రవేత్తలు బీహార్‌ ముజాఫ్ఫర్పూర్‌ జాతీయ పరిశోధన కేంద్రం (ఎన్‌ఆర్‌సీ) నుంచి లిచి పంటకు సంబంధించిన శాహి, బడాన, చైన రకాల మొక్కలను దిగుమతి చేసుకుని ఉద్యాన పరిశోధన స్థానంలో నాట్లు వేశారు. తొమ్మిదేళ్లపాటు వివిధ దశల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.

ఫలించిన లిచి ప్రయోగాత్మక సాగు

శాస్త్రవేత్తలు చేపట్టిన లిచి సాగు మంచి ఫలితాలనిచ్చింది. శాస్త్రవేత్తలు తొమ్మిదేళ్లపాటు పరిశోధనలు చేపట్టారు. 2016 నుంచి 2021 వరకు మొక్కల ఎదుగుదల, మొక్కలను ఆశించే చీడపీడలపై పరిశోధనలు జరిపారు. ప్రారంభం నుంచి మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా వున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కలకు పెద్దగా చీడపీడలు ఆశించలేదు. 2022 నుంచి లిచి మొక్కల నుంచి దిగుబడులు ప్రారంభమయ్యాయి. 2023 వరకు ఓ మాదిరిగా దిగుబడులు వచ్చాయి. 2024, 2025 దిగుబడులు గణనీయంగా పెరిగాయి.

నాణ్యమైన దిగుబడులు

ప్రయోగాత్మక లిచి సాగులో నాణ్యమైన దిగుబడులు వచ్చాయి. పండ్ల పరిమాణం బాగుంది. పండ్లు తీపి, పులుపు రుచుల్లో ఉన్నాయి. పండ్ల రుచిలో తీపి శాతం అధికంగా ఉంటుంది. మొక్క కొమ్మల్లో గుత్తులుగా లిచి పండ్ల దిగుబడులు వస్తున్నాయి. వీటిలో మంచి పోషక విలువలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్కొక్క మొక్క నుంచి 35 కిలోల లిచి పండ్ల దిగుబడి వచ్చింది. పదో ఏడాది నుంచి దిగుబడులు గణనీయంగా పెరగనున్నాయి. వందేళ్ల వరకు ఈ మొక్కలు దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాహి, బడాన అనుకూలం

గిరిజన ప్రాంత నేలలు, వాతావరణం పరిస్థితుల ఆధారంగా శాహి, బడాన రకాలు అత్యంత అనుకూలంగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పరిశోధన స్థానంలో శాహి, బడాన, చైన రకాల లిచి మొక్కలపై పరిశోధనలు నిర్వహించారు. పండ్ల పరిమాణం, నాణ్యత, దిగుబడి ఆశాజనకంగా ఉండడంతోపాటు చీడపీడలు తట్టుకునే తత్వం శాహి, బడానలో పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈమేరకు శాస్త్రవేత్తలు ఈ రెండు రకాల మొక్కలను రైతులకు సిఫారసు చేస్తున్నారు.

ప్రాంతీయ మార్కెట్‌లో విక్రయం

ఉద్యాన పరిశోధన స్థానంలో లిచి మొక్కల నుంచి వచ్చిన పండ్ల దిగుబడులను శాస్త్రవేత్తలు ప్రాంతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈఏడాది మే 15వ తేదీ నుంచి లిచి దిగుబడులు వస్తున్నాయి. కిలో పండ్లు రూ.200లకు విక్రయిస్తున్నారు. లిచి పండ్లను ప్రాంతీయులు, వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. లిచి పండ్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

రైతుల ఆర్డర్‌పై లిచి మొక్కలు పంపిణీ

చెట్టి బిందు, అధిపతి, ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి

ఈ ఏడాది నుంచి రైతుల ఆర్డర్‌పై లిచి మొక్కలు రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లిచి ప్రధాన మొక్కల నుంచి అంటు కట్టి మొక్కలను అభివృద్ధి చేయాల్సి వుంటుంది. మొక్కల అభివృద్ధికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్‌ నాటికి మొక్కలు అందుబాటులోకి వస్తాయి. లిచి మొక్కలను విశ్వవిద్యాలయం నిర్ణయించిన ధరకు రైతులు కొనుగోలు చేసుకోవాలి. గత ఏడాది తక్కువ మోతాదులో రైతులకు మొక్కలు అందజేశాం. మొక్కలు కావాల్సిన రైతులు ఉద్యాన పరిశోధన స్థానాన్ని సంప్రదించాలి.

Updated Date - May 20 , 2025 | 11:19 PM