మన్యం గజగజ
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:45 PM
మన్యంలో సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ చలి తీవ్రత తగ్గలేదు. దీంతో జనం చలికి వణుకుతున్నారు.
తగ్గని చలి తీవ్రత
ముంచంగిపుట్టులో 7.4 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ చలి తీవ్రత తగ్గలేదు. దీంతో జనం చలికి వణుకుతున్నారు. పాడేరులో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తుండగా, జనం చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్నిదుస్తులు ధరిస్తూ, మంటలు కాగుతున్నారు. ప్రధానంగా ఘాట్‌లో పొగమంచు దట్టంగా కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
స్వల్పంగా పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
గతకొన్ని రోజులుగా సింగిల్ డిజిట్‌లో కొనసాగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త పెరిగాయి. ముంచంగిపుట్టులో 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగులలో 8.0, చింతపల్లిలో 9.0, పాడేరు, పెదబయలులో 10.0, అరకులోయలో 10.3, హుకుంపేటలో 11.1, కొయ్యూరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో సోమవారం మంచు దట్టంగా కురిసింది. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలవుతోంది. దీంతో జనం చలికి వణికిపోతున్నారు. ఏ వీధిలో చూసినా చలి మంటలు కనిపించాయి.