Share News

మన్యం గజగజ!

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:07 AM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగ జారుగుతున్నాయి. దీంతో చలితీవ్ర పెరిగింది.

మన్యం గజగజ!

సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

అరకులోయలో 3.6, జి.మాడుగుల, డుంబ్రిగుడులో 3.9 డిగ్రీలు

కొనసాగుతున్న చలి తీవ్రతతో వణుకుతున్న(గిరి) జనం

పాడేరు, డి సెంబరు 8(ఆంధ్రజ్యోతి):

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగ జారుగుతున్నాయి. దీంతో చలితీవ్ర పెరిగింది. సాయంత్రం నుంచే శీతలగాలులు వీస్తుండడం, అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మంచు దట్టంగా కురుస్తుండడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. సోమవారం అరకులోయలో 3.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం. కొయ్యూరు మినహా మిగిలిన అన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌గా నమోదయ్యాయి. జి.మాడుగుల, డుంబ్రిగుడలో 3.9, హుకుంపేటలో 4.6, పాడేరు, ముంచంగిపుట్టులో 4.8, పెదబయలులో 6.1 చింతపల్లిలో 9.1, కొయ్యూరులో 11.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మన్యం గజగజ

శీతాకాలం కావడంతోపాటు వాతావరణంలో ఏర్పడిన మార్పులతో ఏజెన్సీలో మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. చలిప్రభావం అధికంగా వుండడంతో మన్యంవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది, పది గంటల వరకు దట్టంగా పొగ మంచు కురుస్తున్నది. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటలు మాత్రమే ఎండ కాస్తుస్తున్నది. మొత్తంమీద పగలు, రాత్రి అన్న తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. దీనికి తోడు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింతగా పెరిగింది. చలిబారి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు కాగుతున్నారు. పొగమంచు సైతం దట్టంగా కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి.

చింతపల్లిలో..

చింతపల్లి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

మండలవ్యాప్తంగా చలితీవ్రత అధికంగా వుంది. శీతలగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మంచు దట్టంగా కురుస్తున్నది. మిట్టమధ్యాహ్నం సైతం చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు 24 గంటలూ ఉన్నిదుస్తులు ధరించాల్సి వస్తునది. సాయంత్రం ఆరు గంటల నుంచే వీధుల్లో జనసంచారం తగ్గిపోతున్నది. చింతపల్లిలో రాత్రి తొమ్మిది గంటల తరువాత రహదారులన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నది. ఇళ్ల వద్ద, వీధుల్లో మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వరి నూర్పులు, కాఫీ పండ్ల సేకరణ పనులు ఆలస్యంగా మొదలవుతున్నాయి. కాగా ఈ నెలాఖరునాటికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

జి.మాడుగులలో 3.9 డిగ్రీలు

జి.మాడుగుల, డిసెంబరు 8 (ఆంఽధ్రజ్యోతి): మండలంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కొద్ది రోజుల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు తొమ్మిది డిగ్రీలకన్నా తక్కువ నమోదు అవుతున్నాయి. సోమవారం 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోంది. చలి, మంచు ప్రభావంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలుగుతున్నది. ఉదయం పది గంటలైన మంచుతెరలు వీడకపోవడంతో రైతులు గజగజ వణుకుతూ వ్యవసాయ పనులు చేయాల్సి వస్తున్నది.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు, డిసెంబరు 8 ( ఆంధ్రజ్యోతి): చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. మండల కేంద్రంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల తరువాత కూడా పొగ మంచు వీడలేదు. దీంతో సుమారు 50 అడుగుల దూరంలో ఏం వుందో కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తున్నది. ఆరుబయట పనులకు వెళ్లే వారు చలికారణంగా గజగజ వణుకుతున్నారు. చలి వాతావరణం నేపథ్యంలో చంటిపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి స్థానిక సీహెచ్‌సీ వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 02:07 AM