మన్యం గజగజ
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:31 AM
మన్యంలో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం గజగజ వణుకుతున్నారు.
పెరిగిన చలి తీవ్రత
ఉదయం 9 గంటల వరకు వీడని మంచు
పాడేరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం గజగజ వణుకుతున్నారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకొని అన్ని ప్రాంతాల్లో బుధవారం వేకువజాము 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తుండడంతో ద్విచక్రవాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం అరకులోయలో 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ముంచంగిపుట్టులో 10.4, జి.మాడుగులలో 10.7, డుంబ్రిగుడలో 10.9, హుకుంపేటలో 11.9, పెదబయలులో 12.0, పాడేరులో 13.0, చింతపల్లిలో 14.0, అనంతగిరిలో 14.9, కొయ్యూరులో 15.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో చలి వణికిస్తోంది. బుధవారం ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు లైట్ల వెలుతురులో చాలా జాగ్రత్తగా రాకపోకలు సాగించారు.