Share News

మన్యం కాఫీకి మరింత ఖ్యాతి

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:48 PM

సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేసే మన్యం కాఫీకి మరింత ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు.

మన్యం కాఫీకి మరింత ఖ్యాతి
చిక్‌మంగుళూరులో కాఫీ పరిశోధన సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

గిరిజన ప్రాంతంలో కాఫీ ఉత్పత్తి, నాణ్యత పెంపునకు కృషి

చిక్‌మంగుళూరులో కాఫీ పరిశోధన సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేసే మన్యం కాఫీకి మరింత ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగుళూరులో కాఫీ పరిశోధన సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో కాఫీ ఉత్పత్తి, నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే గిరిజన కాఫీ రైతులకు ఆధునిక పద్ధతులను అలవాటు చేసి మరింతగా దిగుబడులు పెరిగేలా చేస్తామన్నారు. చిక్‌మంగుళూర్‌ కాఫీ పరిశోధన సంస్థ అనుభవాలు, సలహాలు, సూచనలను గిరిజన ప్రాంతంలో అమలు చేస్తూ కాఫీ ఉత్పత్తితోపాటు గిరిజన రైతులు ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. కాఫీ పరిశోధనా సంస్థ ఫలితాలు గిరిజన రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లాకు చిక్‌మంగుళూరులో కాఫీ పరిశోధన సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కలెక్టర్‌ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అరకు కాఫీ బ్రాండ్‌ మరింతగా విస్తరణ

మన్యంలో ఉత్పత్తి అయ్యే కాఫీ ‘అరకు కాఫీ’గా ఎంతో ప్రాచుర్యం పొందిందని, దానిని మరింతగా విస్తరించేందుకు కృషి చే స్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని, అలాగే ప్రపంచ మార్కెట్‌లోనూ దాని బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింతగా పెంచేందుకు ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఏజెన్సీలోనే కాఫీ ప్రాసెసింగ్‌, నాణ్యతను పెంచేందుకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించుకుని, రైతులకు అవసరమైన శిక్షణలు, ఆధునిక పద్ధతులు, నాణ్యతకు సంబంధించిన మెలకువలను నేర్పిస్తామని చెప్పారు. ఫలితంగా గిరిజన కాఫీ రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కాఫీ బోర్డు డీడీ మురళీధర్‌, సీనియర్‌ లైజన్‌ అధికారి ఎస్‌.రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 11:48 PM