Share News

మే 2న మన్యం బంద్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:46 PM

స్థానిక కాఫీహౌస్‌లో శనివారం ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీపై రాష్ట్ర స్థాయి ఆదివాసీ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించింది. తక్షణమే ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి ఆర్డినెన్స్‌ లేదా ప్రెసిడెన్సీ ఉత్తర్వులు ఏప్రిల్‌ 30 నాటికి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

మే 2న మన్యం బంద్‌
సమావేశంలో మాట్లాడుతున్న అరకు ఎంపీ డాక్టర్‌.గుమ్మా తనూజారాణి

ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని వినతి

ఏప్రిల్‌ 30న డీఎస్సీ అభ్యర్థులు ఐటీడీఏ వద్ద ధర్నా

రాష్ట్ర ఆదివాసీ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయం

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక కాఫీహౌస్‌లో శనివారం ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీపై రాష్ట్ర స్థాయి ఆదివాసీ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించింది. తక్షణమే ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి ఆర్డినెన్స్‌ లేదా ప్రెసిడెన్సీ ఉత్తర్వులు ఏప్రిల్‌ 30 నాటికి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కుడుముల కాంతారావు ప్రతిపాదించిన భవిష్యత్‌ కార్యాచరణ తీర్మానాన్ని చర్చా వేదిక ఆమోదించింది. చర్చా వేదికకు వల్లా వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఏప్రిల్‌ 20న రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించి ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఐదో షెడ్యూల్డ్‌ ఏరియాలో 100 శాతం రిజర్వేషన్‌ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో అల్లూరి జిల్లాలో 400 పోస్టులకుగాను ఎస్టీలకు 24 పోస్టులు మాత్రమే కేటాయించారన్నారు. గిరిజన గురుకులం జోన్‌-1, జోన్‌-2 పరిధిలో 748 గిరిజన గురుకులం టీజీటీ, పీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులలో 45 పోస్టులు మాత్రమే ఎస్టీలకు కేటాయించారన్నారు. వంద శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఏప్రిల్‌ 27న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ పత్రాలను దహనం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 28న మండల, జిల్లా స్థాయిలో ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల, రాజకీయ పార్టీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని, ఏప్రిల్‌ 30న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని ప్రకటించారు. డీఎస్సీ విషయమై గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి ఈ మెయిల్‌, సోషల్‌ మీడియా ద్వారా వినతులు, రాష్ట్ర గవర్నర్‌కు వినతి, మే 2వ తేదీన అన్ని మండలాల్లో బంద్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ డాక్టర్‌.గుమ్మా తనూజారాణి, గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధాకృష్ణ, వివిధ సంఘాల ముఖ్య నాయకులు వి.నాగేశ్వరరావు, రాజబాబు, ఎం.చిట్టిబాబు, ఆర్‌.జగన్మోహన్‌రావు, ఎస్‌.మాణిక్యం, కె.నీలకంఠం, పి.పాండురంగస్వామి, చిన్నస్వామి, భాను, సోమేశ్వరరావు, వై.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:46 PM