మన్యానికి రెండు టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులు
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:58 PM
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మన్యానికి రెండు టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు.
ఒకటి సుంకరమెట్ట కాఫీ తోటల్లో వుడెన్ బ్రిడ్జికి, మరొకటి మినుములూరు, సంగోడి కాఫీ తోటలకు...
అటవీ అధికారులకు అవార్డులు ప్రదానం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మన్యానికి రెండు టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో పర్యాటకంగా విశేష ఆదరణ పొందుతున్న పర్యాటక ప్రదేశాలకు పర్యాటక శాఖ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాలోని అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని అరకులోయ మండలం సుంకరమెట్ట కాఫీ తోటల్లో ఉన్న వుడెన్ బ్రిడ్జి, పాడేరు మండలంలోని మినుములూరు, సంగోడి కాఫీతోటలను టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపిక చేశారు. సుంకరమెట్టలోని వుడెన్ బ్రిడ్జి విశేష ఆదరణ పొందుతున్న పర్యాటక ప్రదేశంగా ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపిక కాగా, సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశంగా మినుములూరు, సంగోడి కాఫీ తోటలను గుర్తిస్తూ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపిక చేశారు. అనేక సినిమాలతో పాటు ఆర్‌ఆర్‌ఆర్ వంటి అద్భుతమైన సినిమాకు సంబంధించి ప్రారంభ, ముగింపు సన్నివేశాలను ఈ కాఫీ తోటలోనే చిత్రీకరించారు. అలాగే వుడెన్ బ్రిడ్జిను సైతం ఏడాదిలో సుమారుగా లక్ష మంది పర్యాటకులు సందర్శించారు. దీంతో ఈ రెండు ప్రాంతాలకు టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులు దక్కాయి. ఈ మేరకు ఏపీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్, అటవీ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నందిని సూరియాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ రీజనల్ మేనేజర్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.