ప్రైవేటుకు ఫ్లాట్ ఉత్పత్తుల తయారీ
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:23 AM
స్టీల్ ప్లాంటు మరో కొత్త టెండర్ జారీచేసింది. ప్లాంటు సరఫరా చేసే బిల్లెట్లను వివిధ సైజుల్లో ఫ్లాట్లుగా కన్వర్షన్ చేసి ఇవ్వాలనేది ఈ టెండర్ ముఖ్య ఉద్దేశం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇప్పటివరకూ ఫ్లాట్ ఉత్పత్తులను తయారు చేయలేదు. రౌండ్స్ మాత్రమే చేస్తోంది.
టెండర్ విడుదల చేసిన స్టీల్ ప్లాంటు
ఏదో మతలబు ఉందంటున్న కార్మిక వర్గాలు
విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు మరో కొత్త టెండర్ జారీచేసింది. ప్లాంటు సరఫరా చేసే బిల్లెట్లను వివిధ సైజుల్లో ఫ్లాట్లుగా కన్వర్షన్ చేసి ఇవ్వాలనేది ఈ టెండర్ ముఖ్య ఉద్దేశం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇప్పటివరకూ ఫ్లాట్ ఉత్పత్తులను తయారు చేయలేదు. రౌండ్స్ మాత్రమే చేస్తోంది. గతంలో స్టీల్‌ప్లాంటు విస్తరణకు వెళ్లినప్పుడు ఫ్లాట్ ఉత్పత్తుల తయారీకి అనుమతి కోరితే మంత్రిత్వ శాఖ అనుమతులు ఇవ్వలేదు. వాటిని ఇక్కడ తయారుచేస్తే ప్రైవేటు సంస్థలకు పోటీ అవుతుందని నిరాకరించినట్టు విమర్శలు ఉన్నాయి. ఫ్లాట్ ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. మంచి రేటు కూడా లభిస్తుంది. ఇక్కడే యంత్ర పరికరాలకు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాటిని ఉత్పత్తి చేయవచ్చు. కానీ ఎవరికో లబ్ధి చేకూర్చడానికి ఈ టెండర్లు పిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోల్‌కతా, రూర్కెలాలో ఉండేవారు ఈ ఫ్లాట్లు కన్వర్షన్ చేయాలని స్టీల్ ప్లాంటు ప్రకటన జారీచేసింది. కనీసం ఏడాదికి ఆరు వేల టన్నుల బిల్లెట్లను కన్వర్షన్ చేయాలనేది నిబంధన. ఏడాదికి సగటున రూ.84 లక్షల టర్నోవర్‌తో మూడేళ్లు వ్యాపారం చేసి ఉండాలని పేర్కొన్నారు. ఫ్లాట్ల తయారీ మంచి నిర్ణయమే కానీ వాటిని ఇక్కడ తయారు చేయకుండా వేరే వారికి ఇవ్వడం వెనుక ఏదో మతలబు ఉందని ఉద్యోగ వర్గాలు అనుమానిస్తున్నాయి. కొద్దినెలల క్రితం ప్లాంటులో వైర్ రాడ్ మిల్లు ఉండగా, వాటిని తయారు చేయడానికి కూడా ఇలాగే ఒక సంస్థకు మూడేళ్ల కాంట్రాక్టు రూ.200 కోట్లకు ఇచ్చారు.