మానిపండు తెగులుతో కలవరం
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:36 PM
మండలంలోని వరి రైతులను మానిపండు తెగులు కలవరపెడుతోంది. మరో వారం, పది రోజుల వ్యవధిలో పండిన పంట చేతికి అందుతుందన్న గంపెడు ఆశతో ఉన్న రైతులను పంట చివర దశలో ఈ తెగులు ఆందోళనకు గురిచేస్తోంది.
వరి పంట చివరి దశలో ఉండగా వ్యాప్తి
నల్లగా మాడిపోయి రాలిపోతున్న గింజలు
గగ్గోలు పెడుతున్న రైతులు
రావికమతం నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వరి రైతులను మానిపండు తెగులు కలవరపెడుతోంది. మరో వారం, పది రోజుల వ్యవధిలో పండిన పంట చేతికి అందుతుందన్న గంపెడు ఆశతో ఉన్న రైతులను పంట చివర దశలో ఈ తెగులు ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న, మొన్నటి వరకు పాము పొడ, పాచి, ఆకుమచ్చ, తదితర తెగుళ్లతో రైతులు సతమతమవుతుండగా, ఇప్పుడు మానిపండు తెగులు కంటతడి పెట్టిస్తోంది.
మండలంలో ఈ ఏడాది మూడు వేల హెక్టార్లకు పైగా రైతులు ఖరీఫ్ వరిసాగు చేశారు. ఆకుపోతాల నుంచి వరినాట్లు, ఆపై పైరు ఆశాజనకంగానే రావడంతో పెద్దగా చీడపీడలు కూడా లేకపోవడంతో రైతులు ఈ ఏడాది పంట దిగుబడి బాగానే వస్తుందన్న ఆనందంతో ఉన్నారు. పైరు పొట్ట దశ సమయం నుంచి పాము పొడ, పాచి, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించడంతో వాటిని అధిగమించడానికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. మరో వారం, పది రోజుల వ్యవధిలో పంట కోతకు వస్తుందన్న తరుణంలో మానిపండు తెగులు ఆకస్మికంగా వరిపై వచ్చి గింజలు మసిబొగ్గులా మారిపోయి నేలరాలుతున్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తెగుళ్లన్నీ ఒక్క ఆర్‌జేఎల్ రకానికే అధికంగా వస్తున్నాయని, అక్కడక్కడ సాంబామసూరికి కూడా ఉందని రైతులు వాపోతున్నారు. గత రెండేళ్లుగా మానిపండు తెగులు అధికంగా వస్తున్నదని రైతులు అంటున్నారు. మండలంలో పలు గ్రామాల్లో ఈ తెగులు ఉధృతంగా రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క తెగుళ్ల బెడద, మరో పక్క తుఫాన్ బెంగతో కంటి మీద కునుకు ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.