Share News

విత్తన శుద్ధి చేయకే మానిపండు తెగులు

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:43 AM

విత్తన శుద్ధి చేయకపోవడంతో పాటు సొంత విత్తనం వల్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉందని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.రాజ్‌కుమార్‌ అన్నారు.

 విత్తన శుద్ధి చేయకే మానిపండు తెగులు
కొమిరలో మానిపండు తెగులు సోకిన వరి పొలాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల బృందం

కేవీకే ప్రొగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ రాజ్‌కుమార్‌ వెల్లడి

శాస్త్రవేత్తల బృందంతో కలిసి పలు గ్రామాల్లో పంట పొలాలు పరిశీలన

రైతులకు పలు సూచనలు

రావికమతం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : విత్తన శుద్ధి చేయకపోవడంతో పాటు సొంత విత్తనం వల్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉందని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.రాజ్‌కుమార్‌ అన్నారు. ‘మానిపండు తెగులుతో కలవరం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ నర్సీపట్నం డివిజన్‌ ఏడీ శ్రీదేవితో పాటు కేవీకే ప్రొగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ రాజ్‌కుమార్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ సౌజన్యలు రైతులతో కలిసి మానిపండు తెగులు సోకిన కొమిర, మత్స్యపురం, చినపాచిల గ్రామాల్లోని వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తన శుద్ధి చేయక పోవడం వల్లనే ఈ తెగులు ఆశించిందని రైతులకు తెలిపారు. ముందుగా ఈ తెగులు సోకిన వరి కంకులను త్వరితగతిన తొలగించాలన్నారు. లేనిపక్షంలో గాలికి ఈ బూడిద ఎగిరి పక్క వాటికి వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ తెగులు సోకిన వరిని విత్తనంగా కట్టకూడదన్నారు. రైతులు సొంతంగా విత్తనం తయారు చేసేటప్పుడు సుడోమోన్‌ష్‌, కార్బిన్‌డిజమ్‌ మందును విత్తనంలో కలిపి శుద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ తెగులు నివారణకు పురుగు మందులు కొట్టినా ఫలితం ఉండదన్నారు. మానిపండు తెగులు ఆశించకుండా అడుగు పొట్ట దశలో వరి ఉన్నప్పుడే ప్రోపికోనజల్‌ మందును లీటరు నీటిలో రెండు ఎంఎల్‌ చొప్పున కలిపి ఎకరానికి 200 ఎంఎల్‌ మందును సాయంత్రం సమయంలో పిచికారీ చేసుకుంటే ఈ తెగులు సోకదని వివరించారు. లేదా కార్బిన్‌డిజమ్‌ + మేన్కోజబ్‌ మందు లీటరు నీటకి రెండు గ్రాముల చొప్పున కలిపి ఎకరానికి 200 గ్రాములు ఈనే దశలో పిచికారీ చేసుకుంటే ఈ తెగులు సోకదని స్పష్టం చేశారు. అలాగే వరిలో రెక్కరాల్చు పురుగు ఉన్నందున దీని నివారణకు క్లోరీఫైరీప్లస్‌ మందు లీటరు నీటిలో 2.5 ఎంఎల్‌ చొప్పున ఎకరానికి 500 ఎంఎల్‌ మందు పిచికారీ చేసుకోవాలన్నారు. లేకుంటే ప్రిప్రోసిల్‌ మందు లీటరు నీటికి రెండు ఎంఎల్‌ చొప్పున ఎకరానికి 400 ఎంఎల్‌ మందు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమేశ్‌బాబు, ఎంపీఈవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:43 AM