Share News

ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం షాక్‌

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:53 AM

విశాఖపట్నం స్టీల్‌ యాజమాన్యం ఉద్యోగులు, కార్మికులకు శనివారం మరో ఝలక్‌ ఇచ్చింది.

ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం షాక్‌

ఈ నెల నుంచి ఉత్పత్తికి తగినట్టుగా జీతాలు ఇస్తామని ఉత్తర్వులు

విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ యాజమాన్యం ఉద్యోగులు, కార్మికులకు శనివారం మరో ఝలక్‌ ఇచ్చింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో అందరికీ పూర్తి జీతాలు ఇచ్చామని, నవంబరు నెల నుంచి ఉత్పత్తితో ముడిపడిన జీతాలు ఇస్తామని ఉత్తర్వులు జారీచేసింది. అంటే లక్ష్యం మేరకు ఉత్పత్తి చేస్తేనే పూర్తి జీతం (100 శాతం) వస్తుందని, ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు జీతాలు కూడా తగ్గుతాయని ప్రకటించింది. ఇటీవల స్టీల్‌ యాజమాన్యం రోజుకు 19 వేల టన్నులు ఉత్పత్తి తీస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హామీ ఇచ్చింది. ముడి పదార్థాలు అందుబాటులో లేక, విభాగాల్లో తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల ఒక్కరోజు కూడా ఆ లక్ష్యం సాధించలేకపోయారు. దాంతో ఉద్యోగులు, కార్మికులు ఆ లక్ష్యం సాధిస్తేనే 100 శాతం జీతాలు ఇస్తామని, లేదంటే కోత తప్పదని ఇప్పుడు ఒత్తిడి పెడుతోంది. దీనికి లక్ష్యాలు నిర్దేశించింది. సింటర్‌ ప్లాంటులో రోజుకు సగటున 24 వేల టన్నులు, బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా రోజుకు 19 వేల టన్నుల హాట్‌ మెటల్‌, ఎస్‌ఎంఎస్‌ విభాగంలో 125 హీట్లు, కోక్‌ ఓవెన్‌ ప్లాంటులో 370 పుషింగ్‌లు, రోలింగ్‌ మిల్స్‌లో 13,500 టన్నులు, మార్కెటింగ్‌లో 15 వేల టన్నులు తీయాలని స్పష్టంచేసింది. యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు, విభాగాలు సవ్యంగా నడవడానికి విడి భాగాలు ఇవ్వాల్సి ఉందని, వాటిని ఇవ్వకుండా పూర్తి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Nov 16 , 2025 | 01:53 AM