మలేరియా ఉద్యోగాల భర్తీకి బ్రేక్
ABN , Publish Date - May 28 , 2025 | 01:02 AM
జీవీఎంసీ మలేరియా విభాగంలో సీజనల్ కార్మికుల నియామకానికి బ్రేక్ పడింది. వచ్చేనెల ఆరున జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రజారోగ్య విభాగం అధికారులను జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఉన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ ఆదేశించినట్టు తెలిసింది.
కౌన్సిల్‌లో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రజారోగ్య విభాగం
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు పోస్టులు పందేరం చేసినట్టు ఆరోపణలు
విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మలేరియా విభాగంలో సీజనల్ కార్మికుల నియామకానికి బ్రేక్ పడింది. వచ్చేనెల ఆరున జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రజారోగ్య విభాగం అధికారులను జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఉన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ ఆదేశించినట్టు తెలిసింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో మలేరియా, డెంగ్యూ జ్వరాల నియంత్రణకు 431 మంది సీజనల్ సిబ్బందిని నియమించుకోవాలని ప్రజారోగ్య విభాగం అధికారులు నిర్ణయించారు. వీరు ఇంటింటికీ వెళ్లి దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, డ్రై డే పాటించేలా అవగాహన కల్పించడం, లార్వాలను గుర్తించి నిర్వీర్యం చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏటా తాత్కాలిక సిబ్బందిని నియమించుకుంటారు. ఈ ఏడాది కూడా 431 మంది నియామకానికి ఫైల్ తయారుచేసి జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆమోదానికి పంపించారు. అయితే సీజనల్ మలేరియా కార్మికుల పోస్టుల భర్తీ గురించి తెలుసుకున్న కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమకు కొన్ని కేటాయించాలని కోరారు. దీంతో అధికారులు కార్పొరేటర్‌కు మూడు, ఎమ్మెల్యేకు పది చొప్పున పంపకాలు వేశారు. మలేరియా పోస్టులు ఇప్పిస్తామంటూ కొందరు కార్పొరేటర్లు ఆశావహుల నుంచి డబ్బులు వసూలుచేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అవుట్‌సోర్సింగ్‌లో పెట్టించేస్తామని మభ్యపెట్టి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు చొప్పున డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన ఇన్‌చార్జి కమిషనర్ ఎంఎన్‌హరేంధిరప్రసాద్ మలేరియా పోస్టుల భర్తీని తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. వచ్చే నెల ఆరున జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాతే భర్తీ విషయంలో ముందుకువెళ్లాలని అధికారులకు స్పష్టంచేశారు.
ఏపీఈఏపీ సెట్-2025కు 94.37 శాతం మంది హాజరు
విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2025కు జిల్లాలో 94.37 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈఏపీసెట్-2025ను ఈ నెల 19 నుంచి మంగళవారం వరకూ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 41,162 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 38,845 (94.37 శాతం) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సుల పరీక్షకు 32,025 మంది హాజరుకావాల్సి ఉండగా, 30,505 (95.28 శాతం) మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్షకు 9,137 మంది హాజరుకావాల్సి ఉండగా, 8,340 (91.28 శాతం) మంది హాజరయ్యారు.