పరిశ్రమల హబ్‌గా మాకవరపాలెం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:52 AM
నర్సీపట్నం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
నేడు ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన
రాచపల్లిలో 310 ఎకరాలు కేటాయింపు
యూనిట్ల స్థాపనకు మరో రెండు కంపెనీలు ఆసక్తి
పెట్టుబడుదారుల సదస్సులో ఒప్పందాలు
మాకవరపాలెం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
నర్సీపట్నం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు కేంద్రానికి మంగళవారం మాకవరపాలెం మండలంలో శంకుస్థాపన చేయనున్నారు. ఇదే మండలంలో మరో రెండు ప్రైవేటు కంపెనీలకు భూములు కేటాయించారు.
రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలను విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇండస్ర్టియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నది.
నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి మాకవరపాలెం మండలంలో ప్రభుత్వ భూములు అందుబాటులో వుండడంతోపాటు రవాణా పరంగా అనువుగా వుండడంతో స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇండస్ర్టియల్ పార్కును (ఎంఎస్‌ఎంఈ) ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో రెండు నెలల క్రితం ఆమోదం లభించింది. రాచపల్లి రెవెన్యూ పరిధిలో ఏపీఐఐసీకి చెందిన 310 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం అల్యూమినియం కంపెనీ కోసం ప్రభుత్వం భూమిని సేకరించింది. కంపెనీకి కేటాయించగా 290 ఎకరాలు మిగిలింది. ఇది అప్పటి నుంచి ఏపీఐఐసీ ఆధీనంలో వుంది. దీంతోపాటు 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూమిలో మరో 20 ఎకరాలతో కలిపి మొత్తం 310 ఎకరాల్లో ఎంఎస్‌ఎన్‌ఈ పార్కు ఏర్పాటు కానున్నట్టు తహశీల్దార్ వెంకటరమణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు తెలిపారు.
ఇదిలావుండగా మాకవరపాలెం మండలంలో ప్రైవేటు రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహానిస్తున్నది. రాచపల్లి సర్వే నంబరు 737లో చిన్న, సన్నకారు రైతుల సాగులో ఉన్న కొండపోరంబోకు భూమి 406 ఎకరాలు వున్నట్టు గుర్తించారు. ఇందులో 150 ఎకరాలను ఎక్స్‌కవేటర్లు, బుల్‌డోజర్లు వంటి వాటికి విడిభాగాలను తయారు చేసే ‘డోస్క్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీకి, మరో 150 ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి కేటాయించినట్టు ఆధికారులు చెబుతున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సులో వీటికి సంబంధించిన ఎంఓయూలు చేసుకుంటారని తెలిసింది.