Share News

పాఠశాలలకు మహర్దశ

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:34 PM

కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని పలు పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. వికసిత్‌ భారత్‌లో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ విద్యాలయాలను మరింతగా మెరుగుపరిచేందుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

పాఠశాలలకు మహర్దశ
అరకులోయ మండలం రవ్వలగూడలో సిద్ధం చేసిన కెమిస్ర్టీ ల్యాబ్‌ భవనం

‘ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా’లో భాగంగా జిల్లాలో 23 ఉన్నత పాఠశాలలు ఎంపిక

మొత్తం రూ.6.24 కోట్లతో అభివృద్ధి

ఈ నెలాఖరుకు పనులు పూర్తికి కసరత్తు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని పలు పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. వికసిత్‌ భారత్‌లో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ విద్యాలయాలను మరింతగా మెరుగుపరిచేందుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో మొత్తం 23 ఉన్నత పాఠశాలలను ఇందుకు ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆయా పాఠశాలలను మెరుగుపరిచేందుకు రూ.6 కోట్ల 24 లక్షల వ్యయంతో అవసరమైన చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు.

‘ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా’ పేరిట జాతీయ విద్యావిధానం 2020ని అమలు పరుస్తూ గుణాత్మక విద్య, అభ్యాసన ఫలితాలు మెరుగుపరచడం ద్వారా ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో జిల్లాలోని జీకేవీధి మండలంలో రెండు ఉన్నత పాఠశాలలను, మిగిలిన 21 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 23 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో అవసరాన్ని బట్టి కెమిస్ట్రీ ల్యాబ్‌, ఆట స్థలం, కిచెక్‌ గార్డెన్‌, గ్రంఽథాలయం, సైన్సు ల్యాబ్‌, మరుగుదొడ్లను సంపూర్ణంగా మెరుగుపరుస్తారు. దీంతో ఆయా ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక, రసాయనిక బోధన, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులు ఒక లక్ష్యంతో చక్కని ఫలితాలు వైపు పయనిస్తారనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అయితే ఈ ఏడాది జనవరిలో మొదలైన ఆయా పాఠశాలల అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు వచ్చాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకు పనులు పూర్తవుతాయని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ ఎ.స్వామినాయుడు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.

జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలివే..

‘ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా’ పేరిట జిల్లాలోని 23 ఉన్నత పాఠశాలలను సమగ్ర శిక్ష అధికారులు ఎంపిక చేసి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పాడేరు మండలంలో తలారిసింగి ఆశ్రమ ఉన్నత పాఠశాల, అడ్డతీగల గురుకులం, అనంతగిరి మండలంలో చిలకలగెడ్డ, అరకులోయ మండలంలో రవ్వలగుడ ఆశ్రమ పాఠశాల, చింతపల్లి ఆశ్రమ పాఠశాల, చింతూరు మండలంలో నరసింహాపురం, దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట, డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాల, జీకే వీధి మండలంలో రింతాడ ఆశ్రమ పాఠశాల, జి.మాడుగుల గురుకులం, గంగవరం ఆశ్రమ పాఠశాల, జీకేవీధి ఆశ్రమ పాఠశాల, హుకుంపేట మండలం పెదగరువు ఆశ్రమ పాఠశాల, కొయ్యూరు ఆశ్రమ పాఠశాల, కూనవరం గురుకులం, మారేడుమిల్లి గురుకులం, ముంచంగిపుట్టు ఆశ్రమ పాఠ శాల, ఎటపాక మండలంలో లక్ష్మీదేవిపేట స్కూల్‌, పెదబయలు గురుకులం, రాజవొమ్మంగి మండలం దూసరిపాము, రంపచోడవరం గురుకులం, వీఆర్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాల, వై.రామవరం మండలం కోట పాఠశాలను ఎంపిక చేశారు.

పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాల వివరాలు

- రూ.2 కోట్ల 18 లక్షలతో ఒక్కో పాఠశాలకు రూ.15.58 లక్షలు చొప్పున 14 పాఠశాలల్లో కెమిసీ్ట్ర ల్యాబ్‌లు

- రూ.75 లక్షలతో 15 పాఠశాలల్లో రూ.5 లక్షల చొప్పున వ్యయం చేసి క్రీడా మైదానాలు

- రూ.32.50 లక్షలతో 13 స్కూళ్లలో కిచెక్‌ గార్డెన్లు

- రూ.46.20 లక్షలతో రెండు పాఠశాలల్లో గ్రంథాలయ భవనాలు

- రూ. 23.10 లక్షలతో ఒక పాఠశాలలో సైన్సు ల్యాబ్‌

- రూ.2 కోట్ల 30 లక్షలతో 23 పాఠశాలకు ర్యాంప్‌లు, మరుగుదొడ్ల అభివృద్ధి

Updated Date - Jun 10 , 2025 | 11:34 PM