Share News

చెరువులకు మహర్దశ

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:25 AM

చెరువులకు మహర్దశ

చెరువులకు మహర్దశ
రైవాడ జలాశయాన్ని పరిశీలిస్తున్న జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కేవీఎన్‌ స్వర్ణకుమార్‌

‘ట్రిపుల్‌ ఆర్‌’ పథకం కింద రూ.330 కోట్లతో అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు

జల వనరుల శాఖ సీఈ స్వర్ణకుమార్‌

దేవరాపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘ట్రిపుల్‌ ఆర్‌’ (రీకనస్త్ట్రక్షన్‌, రెనోవేషన్‌, రిహాబిలిటేషన్‌) పథకం కింద రూ.330 కోట్లతో సాగునీటి చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్టు జలవనరుల శాఖ ఉత్తరాంద్ర చీఫ్‌ ఇంజనీర్‌ కేవీఎన్‌ స్వర్ణకుమార్‌ తెలిపారు. గురువారం ఆయన రైవాడ జలాశయాన్ని సందర్శించారు. అనంతరం దేవరాపల్లిలోని రైవాడ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. మొంథా తుఫాన్‌ కారణంగా అనకాపల్లి జిల్లాలో దెబ్బతిన్న జలవనరుల శాఖ పనులకు తాత్కాలిక మరమ్మతులకు రూ.2.48 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.42 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండితే.. స్పిల్‌వే గేట్లు ఎత్తడానికి అవసరమైన సిబ్బంది పూర్తస్థాయిలో లేరని, ఆయా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ‘జైకా’ నిధులతో గతంలో చేపట్టిన రైవాడ కాలువల ఆధునికీకరణ పనులు చేయాలంటే రూ.43.8 కోట్లు అవసరమని, ఈ పనులు చేయడానికి 2028 వరకు గడువు వుండడంతో నిధుల విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

రైవాడ జలాశయం గట్టు పటిష్ఠత, కొత్త స్పిల్‌వే నిర్మాణం, గేట్లు ఏర్పాటు, పంట కాలువల ప్రధాన తూముల పునర్నిర్మాణ పనుల కోసం రూ.336 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ఏ పథకం కింద నిధులు మంజూరు చేయాలన్నది ప్రభుతం పరిశీలనలో ఉందని చీఫ్‌ ఇంజనీర్‌ చెప్పారు. పెద్దేరు రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు పూర్తిచేయడానికి రూ.84 కోట్లు మంజురయ్యాయని తెలిపారు.

ఉత్తరాంధ్రలో అసంపూర్తిగా వున్నతొమ్మిది జలాశయాల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. వీటికి రూ.20,300 కోట్లు వ్యయంతో చేస్తున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే ఇంతవరకు ఉన్న ఆయకట్టు 2.5 లక్షల ఎకరాలతోపాటు మరో 1.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఈ పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆయన వెంట డీఈఈ సత్యంనాయుడు, నీటి సంఘం చైర్మన్‌ పాత్రునాయుడు, తదితరులు వున్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:26 AM